* భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మేలో 12వ సారి పెంపు.ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి.ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరగా..మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి.ఇంతకు ముందు శుక్రవారం ధరలు పెరగ్గా.. ఒక రోజు విరామం తర్వాత తాజాగా ఆదివారం పెట్రోల్‌పై లీటర్‌కు 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వరకు పెంచాయి.కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.21, డీజిల్ రూ.84.07కు చేరింది.ఆర్థిక రాజధాని ముంబై నగరంలో దాదాపు వందకు చేరువైంది.లీటర్ పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.91.30కు పెరిగింది.చెన్నైలో పెట్రోల్ రూ.94.86 డీజిల్ రూ.88.87, కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.27, డీజిల్ రూ.86.91, హైదరాబాద్‌లో రూ.96.88, డీజిల్ రూ.91.65, జైపూర్‌లో పెట్రోల్ రూ.99.68, డీజిల్ రూ.92.78కు చేరాయి.మే నెలలో ఇప్పటి వరకు 12 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.81, డీజిల్‌పై రూ.3.34 పెంచాయి.పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.
* వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనేది చూసుకోకుండానే వివిధ వయసుల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించడంపై సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ఆ కంపెనీ వివరణ ఇచ్చింది. అది కంపెనీ అభిప్రాయం ఏమాత్రం కాదని స్పష్టం చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ అభిప్రాయానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు దూరంగా ఉంటోందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖకు ఆ కంపెనీ డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్ సింగ్ లేఖ రాశారు. కంపెనీ సీఈవో అదర్ పూనావాలా తరఫున లేఖ రాస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరులో భాగంగా కొవిషీల్డ్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని లేఖలో వివరించారు. పూనావాలా మాత్రమే కంపెనీ అధికార ప్రతినిధి అని స్పష్టంచేశారు.
* అమరరాజా బ్యాటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.2,102.70 కోట్ల నికర ఆదాయాన్ని, రూ.189.48 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదేకాలంలో నికర ఆదాయం రూ.1,581.39 కోట్లు, నికర లాభం రూ.136.65 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి అమరరాజా బ్యాటరీస్ నికర ఆదాయం రూ.7149.68 కోట్లు, నికరలాభం రూ.646.81 కోట్లు ఉన్నాయి. 2019-20లో నికర ఆదాయం రూ.6839.46 కోట్లు, నికరలాభం రూ.189.38 కోట్లు నమోదయ్యాయి. మొత్తం మీద చూస్తే ఆదాయాలు, లాభాల్లో మెరుగైన వృద్ధి కనబరచినట్లు అవుతోంది. వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ.6 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద, నాలుగో త్రైమాసికంలో మెరుగైన పనితీరు సాధించినట్లు అమరరాజా బ్యాటరీస్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటాయని ఆశిస్తున్నామని, అందువల్ల తమ విస్తరణ ప్రాజెక్టులను నిర్ణీత ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇంధన నిల్వ, మొబైల్ ఎనర్జీ అప్లికేషన్ల విభాగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
* కొన్ని రకాల కేన్సర్ వ్యాధులను అదుపు చేసేందుకు వినియోగించే లెనలిడోమైడ్ జనరిక్ ఔషధాన్ని అమెరికా విపణిలో విడుదల చేసేందుకు నాట్కో ఫార్మా అనుమతి సంపాదించింది. 5ఎంజీ, 10ఎంజీ, 15ఎంజీ, 25ఎంజీ డోసుల్లో ఈ ఔషధాన్ని విక్రయించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తుది అనుమతి ఇచ్చింది. దీనికి మూడేళ్ల క్రితమే తాత్కాలిక అనుమతి రాగా, తుది అనుమతి కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. లెనలిడోమైడ్ ఔషధంపై పేటెంట్ హక్కులు అమెరికాకు చెందిన సెల్‌జీన్ (బ్రిస్టల్-మేర్స్ స్క్విబ్‌కు అనుబంధ సంస్థ) అనే కంపెనీకి ఉన్నాయి. దీన్ని ‘రెవ్‌లీమిడ్’ బ్రాండు పేరుతో ఆ సంస్థ విక్రయిస్తోంది. సెల్‌జీన్‌తో పేటెంట్ వివాదాన్ని (పారా-4 లిటిగేషన్) నాట్కో ఫార్మా గతంలోనే పరిష్కరించుకుంది. దీని ప్రకారం 2022 మార్చి నుంచి అమెరికాలో లెనలిడోమైడ్ జనరిక్ ఔషధాన్ని విక్రయించవచ్చు. దీనికి సంబంధించి 6 నెలల ప్రత్యేక మార్కెటింగ్ హక్కులు కూడా నాట్కో ఫార్మాకు ఉన్నాయి. అంటే ఆరు నెలల పాటు సెల్‌జీన్, నాట్కో ఫార్మా మినహా మరొక కంపెనీ అమెరికాలో ఈ ఔషధాన్ని విక్రయించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో తన మార్కెటింగ్ భాగస్వామి అయిన ఆరో ఇంటర్నేషనల్ లిమిటెడ్ (తెవా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ) ద్వారా అమెరికాలో విక్రయాలు చేపట్టేందుకు నాట్కో ఫార్మా సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇదే ఔషధాన్ని కెనడాలోనూ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.