* జాతీయ స్థాయి ఇంగ్లీషు పక్షపత్రిక “ఫ్రంట్ లైన్” తాజా సంచిక ప్రధాని మోడి ముఖచిత్రంతగా ఆయనపై కవర్ స్టొరీతో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కవర్ స్టొరీకి ఆపత్కాలానికి తగనివాడు అనే హెడ్డింగ్ ను నిర్ణయించారు. కవర్ పై సంక్షిప్తంగా ఇలా రాసారు- రెండో ధపా కోవిడ్-19 దేశంలో లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను మింగింది. కోట్ల జనాల కడుపు కొట్టింది. ఈ కరోనా రోగం మన దేశంలో కొనసాగుతున్న ప్రజా వైద్య ఆరోగ్య వ్యవస్థ అధమస్థితిలో ఉందన్న బలహీనతను బయటపెట్టడమే కాదు… ఉక్కు మనిషి, మహాశక్తివంతుడు, నిర్ణయాత్మక నాయకుడు ప్రధాని మోడి అని జరిగే ప్రచారంలోని డొల్లతనాన్ని కూడా బయటపెట్టింది.
* దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూ సుమారు 20 లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నప్పటికీ కొత్త కేసుల సంఖ్య 3 లక్షలలోపే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2.40 లక్షల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 4వేల్లోపే ఉన్నాయి.
* దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 1,649 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది మార్చి 30 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దిల్లీలో పాజిటివిటీ రేటు సైతం 2.42కి తగ్గింది.
* కొవిడ్ టీకా విషయంలో పాలిచ్చే తల్లులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. టీకా తీసుకున్న తర్వాత విరామం ఇవ్వాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం ఆపొద్దని తాము ఎక్కడా చెప్పలేదున్నారు. ఒకటి రెండు రోజులు ఆగాల్సిన అవసరం కూడా లేదన్నారు.
* నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు అనుమతి వస్తే ఆయుర్వేద ఫార్మసీలో ఔషధం తయారీకి తితిదే సిద్ధమని తితిదే పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైద్యుల బృందంతో కలిసి ఆయుర్వేద ఔషధాన్ని పరిశీలించామని చెప్పారు. మందులో దుష్ప్రభావం కలిగిన పదార్థాలు లేవని చెబుతున్నారని ఆయన తెలిపారు. ఐసీఎంఆర్, ఆయుష్ నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. పరిశోధనా బృందం ఆనందయ్య ఔషధాన్ని కరోనా మందు కాదని తేల్చినా ఇమ్యూనిటీ బూస్టర్లుగా పరిశీలిస్తామన్నారు.
* తెలంగాణలో నేటి నుంచి ఫుడ్ డెలివరీ, ఈ- కామర్స్ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. అత్యవసర రాకపోకలు సాగించేవారిని అడ్డుకోబోమని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలకు ఆదేశాలు అందాయి. నిన్న హైదరాబాద్‌లో లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చిన సమయంలో పలుచోట్ల ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకొని, కొందరి వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
* ఏపీలో కొత్తగా 18,767 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రోజూ 20వేలకు పైగా కేసులు నమోదువుతుండగా 19 వేలలోపే నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో 20,109 మంది కోలుకోవడం ఊరట కల్పించే అంశం. చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో వెయ్యిలోపే కేసులు నమోదయ్యాయి.
* మీరు సముద్రం ఒడ్డున నిలబడి ఆ నీళ్లలో ఓ మునకేశారనుకుందాం. పొరబాటున మీ నోట్లోకి కొన్ని నీళ్లు పోయాయి. ఆ కాసిని నీళ్లలో ఐదు కోట్ల వైరస్‌లు ఉంటాయని ఓ అంచనా. అమ్మో.. అనుకోకండి. ఆ వైరస్‌లలో ఒకట్రెండు కూడా మీకు హాని చేసేవి ఉండవు. ఇక లీటర్ సముద్రం నీటిలోనైతే రెండొందల కోట్ల వరకూ వైరస్‌లు ఉంటాయట. సముద్రంలో అవేం చేస్తుంటాయీ అంటే… అక్కడి బ్యాక్టీరియాని వేటాడుతుంటాయి. వాటివల్లే మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతోంది.
* 1896 ప్రాంతం… కలరా వ్యాధి విలయతాండవం చేస్తోంది. అప్పటికి కలరాకి ‘విబ్రియో కొలెరె’ అన్న బ్యాక్టీరియానే కారణమని గుర్తించారు. కానీ, దాని వ్యాప్తిని ఎలా అరికట్టాలో తెలియట్లేదు. ఎర్నెస్ట్ హ్యాంకిన్ అనే బ్రిటిష్ ఇండియా శాస్త్రవేత్త అప్పుడో చిత్రమైన విషయం ప్రకటించాడు. గంగ-యమున నదుల్లోని నీటిని కలిపితే అందులో కలరా బ్యాక్టీరియా పెరగదని ప్రకటించి నిరూపించాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. భారతీయులు పవిత్ర నదులుగా కొలిచే గంగ-యమునలకి నిజంగానే అంత శక్తి ఉందా అనుకున్నారంతా! ఆ తర్వాత 20 ఏళ్లకి- 1917లో డి-హెలె అనే ఫ్రెంచి శాస్త్రవేత్త గంగ-యమున నదుల్లోని బ్యాక్టీరియాఫేగస్ అనే వైరస్‌లే అందుకు కారణమని తేల్చాడు. ఇవి బ్యాక్టీరియాని చెండుకు తినే వైరస్‌లన్నమాట!
* జీవి ఏదైనా సరే… వాటికంటూ ఎంతోకొంత జ్ఞాపకం ఉంటుంది. వెన్నెముక జీవులకి ఈ జ్ఞాపకం మరీ అవసరం. మన మెదడులో జ్ఞాపకశక్తికి కారణమైన ప్రొటీన్‌ని ఆ మధ్య 3డీ ప్రింట్ తీశారు అమెరికాకి చెందిన జేసన్ షెఫర్డ్ అనే న్యూరాలజిస్టు. అది అచ్చం ఓ వైరస్ ఆకారంలోనే రూపుదిద్దుకుంది. ఆ ప్రొటీన్‌కి కారణమయ్యే మనలోని జన్యువేంటా అని పరిశోధించి దానికి ‘ఏఆర్‌సీ’ అని పేరు పెట్టారు. చిత్రమేంటంటే ఆ ‘ఏఆర్‌సీ’ జన్యువు కూడా లక్షల సంవత్సరాలకిందట వైరస్ వల్లే మనలోకి వచ్చిందట. అదే మనుషులుగా మనం బుద్ధిజీవులం కావడానికి తొలి బీజం వేసిందంటారు జేసన్. ఇలా, వైరస్‌ల వల్ల మన శరీరంలో ఎన్నో మంచి జన్యుమార్పులు చోటుచేసుకున్నాయని చెప్పొచ్చు. మానవ శరీరంలో సుమారు పాతికవేల దాకా జన్యువులుంటాయి. వాటిలో ఎనిమిది శాతం వైరస్‌ల కారణంగా మనలోకి వచ్చినవేనట!
* బొల్లారం కంటోన్మెంట్‌లోని కరోనా ఆస్పత్రిని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బొల్లారం పీహెచ్‌సీని 50 పడకల కరోనా ఆస్పత్రిగా మార్చాలని ఎంపీ గతంలోనే నిర్ణయించారు. ఈమేరకు ఆ ఆస్పత్రిని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. ఎంపీ నిధులతోపాటు, తన సొంత నిధులను ఉపయోగించి అవసరమైన ఫర్నిచర్, వైద్యపరికరాలు కొనుగోలు చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఆస్పత్రిని అభివృద్ధి చేశానని చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధికోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు.
* దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు కరోనా మూడో దశ వ్యాప్తి ప్రమాదం కూడా పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి చిన్నారులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండోదశ వ్యాప్తిలో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. మూడోదశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. రెండోదశలో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిదని, ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నామని ఉద్ధవ్ తెలిపారు.
* వాట్సాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత… యాక్టివేషన్ కోసం ఓటీపీ అడుగుతుంది. ఒక్కోసారి ఓటీపీ వేగంగా రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. దీంతో కాల్ ద్వారా ఓటీపీ తీసుకుంటుంటారు. అయితే ఈ రెండు ఆప్షన్ల వల్ల ఓ సమస్య వచ్చి పడింది. మొబైల్‌లో ఆ సిమ్ లేకపోయినా… వాట్సాప్ యాక్టివేషన్ చేసేయొచ్చు. ఆ మొబైల్‌కు వచ్చిన ఓటీపీతో వేరే మొబైల్‌లో యాక్టివేట్ చేసి లాగిన్ అయిపోతున్నారు. ఈ ఆప్షన్ వల్ల వాట్సాప్ స్కామ్‌లు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీనిపై వాట్సాప్ దృష్టిసారించిందట. ఓటీపీల సమస్య లేకుండా చూస్తోందట.
* తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. తన భూమిని నితిన్ కబ్జా చేశారంటూ మేడ్చల్ మండలం రావల్‌కోల్ వాసి మహేశ్ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎంకు విన్నవించుకున్నారు. మహేశ్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ ప్రారంభించాలని సీఎస్ సోమేశ్‌కుమార్, అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విజిలెన్స్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో భూకబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలు, ప్రభుత్వ విచారణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇటీవల ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. తాజాగా ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు అందడంతో సీఎం విచారణకు ఆదేశించారు.
* కొవిడ్ నివారణలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కరోనాతో ప్రజలు పడే ఇబ్బందులను తెలుసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా ఏపీ సీఎం జగన్ కూడా తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం రాజకీయం చేయడం జగన్‌కే చెల్లిందని విమర్శించారు. కొవిడ్ నివారణ, నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ గుంటూరులోని తన నివాసంలో కన్నా రెండు గంటల దీక్ష చేపట్టారు. సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ ముందే హెచ్చరించారని.. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టిందని ఆక్షేపించారు.
* సిద్దిపేటలో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ రాజ్యం నడుస్తోందా అర్థం కావడం లేదని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి విమర్శించారు. సర్కారు ఆస్పత్రుల్లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన భాజపా మహిళా మోర్చా నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.