Health

శవాల్లో కరోనా ఎంతసేపు ఉంటుంది?

శవాల్లో కరోనా ఎంతసేపు ఉంటుంది?

ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కరోనా భయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ ఫొరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్త కీలక విషయాన్ని వెల్లడించారు. కరోనాతో బాధపడుతూ చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12-24 గంటల తర్వాత కరోనా వైరస్‌ బతకలేదని తెలిపారు. ఈ విషయమై ఏడాది కాలంగా ఎయిమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ అధ్యయనం చేస్తోందని వివరించారు. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన మెడికో-లీగల్‌ కేసులను పరీక్షించడం ద్వారా ఈ విషయాలను గుర్తించినట్లు తెలిపారు. ‘‘కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయిన వారి శవాలను 100కు పైగా పరీక్షించాం. ఈ సందర్భంగా మృతదేహాలకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్‌ వచ్చింది. ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే 12-24 గంటల తర్వాత ఆ వ్యక్తి ముక్కు, శరీరంలో వైరస్‌ బతికి ఉండలేదని గుర్తించాం. శవాలను నుంచి వైరస్‌ వ్యాప్తి జరగడానికి అవకాశం చాలా తక్కువ. అయితే, ముందస్తు రక్షణలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలు, శరీరం నుంచి ద్రవాలు స్రవించే ప్రదేశాలను మూసి వేయడం, రోగికి అమర్చిన వివిధ పైపులను శానిటైజ్‌ చేయాలి’’ అని సూచించారు.

అంత్యక్రియల్లో పాల్గొనే వారు ముందస్తు రక్షణగా కచ్చితంగా మాస్క్‌లు, చేతికి గ్లౌవ్స్‌, పీపీఈ కిట్లు ధరించాలన్నారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం చితాభస్మం సేకరించడం పూర్తిగా సురక్షితమేనని తెలిపారు. ఆ సమయంలో కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదన్నారు. తాము ఈ అధ్యయనం చేయడం వెనుక కారణం చనిపోయిన వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే చేశామన్నారు. మే 2020లో కొవిడ్‌-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్‌మార్టం చేయడంపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్టం చేయడం ద్వారా మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తే, సరైన రక్షణతో వీలైనంత తక్కువ పనితో ఆ తంతు ముగించాలని తెలిపింది.