బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కుంభకోణం వెలుగులోకి రాకముందే భారత్‌ను విడిచి కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా – బార్బుడా దేశంలో ఉంటున్న ఆయన ఆదివారం సాయంత్రం నుంచి కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే అతడు ప్రస్తుతం క్యూబా పారిపోయి ఉంటాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఛోక్సీని భారత్‌కు అప్పగించే విషయమై ఆంటిగ్వా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అతడు దేశం విడిచి పారిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఓ రెస్టారెంట్లో విందు కోసం ఛోక్సీ తన ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు ఆంటిగ్వా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే రోజు సాయంత్రం పోలీసులు అతడి కారును జాలీ హార్బర్ సమీపంలో గుర్తించారు. అయితే అందులో ఛోక్సీ లేకపోవడంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. జాలీ హార్బర్ నుంచి సముద్రమార్గంలో క్యూబా వెళ్లి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యూబాలోనూ ఛోక్సీకి ఆస్తులు ఉన్నాయి. 2018 మార్చిలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ, ఛోక్సీ దేశం విడిచి పారిపోయారు. 2017లోనే ఛోక్సీ ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకుని 2018 నుంచి ఆ దేశంలోనే ఉంటున్నాడు. ఛోక్సీ పౌరసత్వం రద్దు చేయాలని భారత్.. ఆంటిగ్వాను కోరినప్పటికీ అందుకు ఆ దేశం ఒప్పుకోలేదు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అతడికి పౌరసత్వం ఇచ్చామని చెప్పుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల భారత్ నుంచి ఒత్తిడి పెరగడంతో ఛోక్సీ ఇప్పుడు ఆంటిగ్వా వదిలివెళ్లి ఉంటాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఛోక్సీపై భారత్‌లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. అతడిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ అయ్యింది. మరోవైపు నీరవ్ మోదీ లండన్‌లో అరెస్టయిన విషయం తెలిసిందే. అతడిని భారత్‌కు అప్పగించేందుకు దాదాపు మార్గం సుగమమైంది.
క్యూబా చెక్కేసిన ఛోక్సీ
Related tags :