* మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు.పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి.ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి.ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్‌కు 23 పైసలు, డీజిల్ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి.పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.44, డీజిల్ లీటర్ రూ.84.32కు చేరింది.ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువైంది.పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.87.16, చెన్నైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ 87,16కు చేరాయి.హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.12, డీజిల్ రూ.91.92కు చేరింది.ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది.మే నెలలో ఇప్పటి వరకు 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి.ఇప్పటి వరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.80, డీజిల్‌పై రూ.3పైగా పెంచాయి.పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది.ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నారు.ఓ వైపు కరోనాతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.ఈ క్రమంలో పనుల్లేక ఇబ్బందులు పడుతుండగా.. ఈ క్రమంలో ఇంధన ధరల పెరుగుదల మరింత పెనుభారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ దిగజారుతూ వచ్చాయి. ఓ దశలో సెన్సెక్స్ 50,474 వద్ద, నిఫ్టీ 15,163 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్ 14 పాయింట్లు కోల్పోయి 50,637 వద్ద.. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 15,208 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.77 వద్ద నిలిచింది.
* మహమ్మారి విజృంభణతో పరిస్థితి మరింత ప్రతికూలంగా మారితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.7 శాతంగా ఉండే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ బర్‌క్లేస్ అంచనా వేసింది. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చి మరో ఎనిమిది వారాల పాటు లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తే మరో 42.6 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లొచ్చని తెలిపింది.
* కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తూ అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్న నేపథ్యంలో టాటా స్టీల్ తన ఔదార్యాన్ని చాటుకుంది. తమ సంస్థలో కరోనా బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించేందుకు ముందుకు వచ్చింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి.. ఆ ఉద్యోగి రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు ప్రతి నెలా ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది. ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబీకులకు ప్రతి నెలా అందించనున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా టాటా స్టీల్ కంపెనీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
* రెండో దశలో కరోనా మహమ్మారి పేట్రేగిపోయింది. ఫలితంగా మళ్లీ లాక్‌డౌన్‌లు విధించాల్సి వచ్చింది. గతేడాది కొవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక రంగాలు.. తాజా ఆంక్షలతో మరోసారి బేజారవుతున్నాయి. ఇది దేశ జీడీపీపైనా పెను ప్రభావం చూపించే అవకాశమున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పలు ఉద్దీపనలు ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.