ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం రేపు ఏర్పడనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాగా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించనుంది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభంకానున్న చంద్రగ్రహణం సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని కోస్తా తీర ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కనిపిస్తుందని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. కాగా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా, ఆస్ట్రేలియా, అంటారక్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో కన్పిస్తుందని వెల్లడించింది.
సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో మధ్యామ్నం 3.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.22 గంటలకు ముగుస్తుంది. సంపూర్ణ గ్రహణం 14 నిమిషాల 30 సెకన్ల పాటు ఉంటుంది. కోల్‌కతాలో ఇలాంటి చంద్ర గ్రహణాన్ని దాదాపు పదేళ్ల కిందట 2011 డిసెంబరు 10న కనువిందుచేసింది. అయితే ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు 14 నిమిషాల పాటు సంపూర్ణంగా దర్శనమివ్వనుంది.
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 4:47:39 గంటలకు ప్రారంభమై 57 నిమిషాల తర్వాత 5.44 గంటలకు పాక్షికస్థాయికి చేరుతుంది.. 7:11:25 గంటలకు పూర్తిస్థాయికి చేరుకుంటుంది. తర్వాత క్రమంగా గ్రహణం వీడుతూ 10:52:22 గంటలకు పూర్తవుతుంది.
చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్‌గా కనువిందుచేయనున్నాడు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వస్తాయి. సూర్యుడు, చంద్రుడికి మధ్యకు భూమి వచ్చి భూమి నీడ చంద్రునిపై పడటాన్ని చంద్రగ్రహణం అంటారు. భూమి నీడపడినప్పుడు కాంతి తరంగాలు ఫిల్టర్ అవుతాయి. దీంతో చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపిస్తాడు. చంద్రగ్రహణం సమయంలో మే 26న సాయంత్రం అరుదైన సూపర్ బ్లడ్ మూన్ ఆవిష్కృతం కానుంది.