* కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ – డి- గ్లూకోజ్) ఔషధం ధర ఖరారైంది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధం ఒక్కో సాచెట్ ధర రూ. 990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఆ డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
* ఆన్‌లైన్ గ్రాసరీ దిగ్గజం బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా టాటా సన్స్ సొంతమైంది. దీంతో కొత్త రంగాలకు ప్రవేశించాలని యోచిస్తున్న టాటా గ్రూప్‌నకు మార్గం సుగమమైంది. ఆన్‌లైన్ వ్యాపారంలో దూసుకెళ్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ వంటి దిగ్గజాలకు ఇక టాటా కూడా పోటీ ఇవ్వనుంది. టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా డిజిటల్ బిగ్‌బాస్కెట్‌లోని వాటాలను సొంతం చేసుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఇతర వివరాలను రెండూ కంపెనీలూ ఇప్పటి వరకు ప్రకటించలేదు.
* దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఇటీవలే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం విభాగం (డాట్).. తాజాగా అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు 700 మెగాహెర్జ్ బ్యాండ్, 3.3- 3.6 గిగాహెర్జ్ బ్యాండ్, 24.25- 28.5 గిగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీల్లో శుక్రవారం లాభాల జోరు కనిపించింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ మొదలు పెట్టిన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ఓ దశలో 128 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ 15,469 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,435 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 307 పాయింట్లు లాభపడి 51,422 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.47 వద్ద నిలిచింది.