* కర్నూల్ జిల్లాలో రైతులకు విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. జొన్నగిరి, పగిడిరాయి, జి ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో వజ్రాలు లభిస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ వజ్రాలు దొరుకుతున్నాయి. ఇందులో భాగంగానే ఆ జిల్లాలోని ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. చిన్న జొన్నగిరిలో పొలంలో పని చేసుకుంటుండగా ఆ రైతుకు ఈ విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రం ఏకంగా కోటి 25 లక్షలు పలికింది. వేలంలో భాగంగా వజ్రాన్ని కొనుగోలు చేశారు గుత్తి వ్యాపారులు. అదే బహిరంగ మార్కెట్ లో రూ. 3 కోట్లకు పైగా విలువ చేస్తుందని వజ్ర వ్యాపారులు చెబుతున్నారు. ఏది ఏమైనా కోటి 25 లక్షలు రావడంతో ఆ రైతు కుటుంబం ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
* ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అవ్వనున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఏపీలో ఈనెల 31న ముగ్గురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో వచ్చే నెల 3న ఆరుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికావస్తున్న సమయంలో అవి ఖాళీకాక ముందే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను సమీక్షించామని, కరోనా పరిస్థితి గణనీయంగా మెరుగుపడి ఎన్నికలకు తగిన పరిస్థితులు ఏర్పడేవరకు ఎన్నికలను నిర్వహించడం సరికాదని నిర్ణయించామని ఈసీ పేర్కొంది. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనుంది. పరిస్థితులను బట్టి ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది. తెలంగాణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైఎస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతుంది. గవర్నర్ కోటాలో భర్తీ అయిన ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి స్థానం సైతం జూన్ 16న ఖాళీ కానున్నది. గవర్నర్ కోటా కింద భర్తీ చేసే స్థానానికి రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన వ్యక్తి ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్యే కోటా స్థానాలకు శాసనసభ్యుల ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
* కరోనా సెకండ్ వేవ్ ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పలు ఆస్పత్రులు కనీస మానవత్వం మరిచి కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తప్పు చేసిన ఆస్పత్రులకు నోటీసులు జారీచేయడం, జరిమానాలు విధిస్తూ వచ్చింది. అయితే, ఇకపై అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
* ఏలూరు రేంజ్ పరిధిలో పనిచేస్తున్న 58 ఎస్ ఐ లకు సీఐ లుగా పదోన్నతి కల్పించేందుకు ఎపి డిజిపి కార్యాలయం నుంచి అనుమతులు మంజూరు.
* వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన తీరు, తదనంతర పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడి విషయంలో అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించింది. రఘురామ అరెస్టు తీరుపై ఆయన తనయుడు భరత్ ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది.
* పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ తుపానుకు తేరలేపిన నారదా కుంభకోణానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు సహా నేతల అరెస్టు వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీబీఐ వాదనను తోసిపుచ్చుతూ నలుగురు నేతలకు కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 2లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వారికి బెయిల్ ఇచ్చింది. నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో టీఎంసీ మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మంత్రి సోవన్ ఛటర్జీని గతవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. నేతల పిటిషన్లపై హైకోర్టు ద్విసభ్య ధర్మానసం ఇటీవల విచారణ జరిపింది. అయితే తీర్పుపై న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపింది. అదే సమయంలో నేతలను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. దీంతో మే 19 నుంచి నలుగురు నాయకులు గృహనిర్బంధంలో ఉన్నారు.
* రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారం, మందులు, ఆక్సిజన్ సరఫరా.. కర్ఫ్యూ పొడిగింపు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో ఆలోచించాలి. రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలి. ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి’’ అని అధికారులను ఆదేశించారు. ‘‘ఒక్కో ఆస్పత్రికి ఐదు ఎకరాలు కేటాయించాలి. మూడేళ్లలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలి. దీనివల్ల కనీసం 80కి పైగా మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయి’’ అని సీఎం జగన్ తెలిపారు.
* కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి సహాయం చేస్తున్న బాలీవుడ్ సినీ నటుడు సోనూసూద్‌కు ముంబై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఎంతో మందికి సోనూసూద్ సహా పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సేవా కార్యక్రమాలపై జస్టిస్ అమ్జాద్ సయీద్, గిరీష్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోవిడ్ డ్రగ్స్‌పై కేంద్రానికి మాత్రమే అథారిటీ ఉందని, అలాంటప్పుడు సెలబ్రిటీలకు కోవిడ్ మందులు, ఇంజెక‌్షన్లు ఎలా వస్తున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న వారి ఆలోచన మంచిదే కానీ, సెలబ్రిటీలకు ఈ స్థాయిలో కోవిడ్ డ్రగ్స్ ఎలా అందుబాటులో ఉంటున్నాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.