వరకట్న చావులకు సంబంధించిన కేసుల విచారణలో దిగువ కోర్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీరమణ, జస్టిస్ అనిరుద్ధబోస్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. మహిళ మరణానికి ముందు (సూన్ బిఫోర్) భర్త, వారి కుటుంబ సభ్యులు వేధించి ఉండాలని ఐపీసీ సెక్షన్ 304-బి చెబుతున్నప్పటికీ, ఇక్కడ సూన్ బిఫోర్ అంటే మహిళ చనిపోవడానికి ‘తక్షణం ముందు’ అని మాత్రమే అన్వయించడానికి వీల్లేదని పేర్కొంది. వేధింపులు అంతకు ముందు రోజుల్లో నిరంతరం జరిగి ఉండొచ్చని పేర్కొంది. అందువల్ల భర్త, అతని బంధువులు చేసిన వేధింపులు, క్రూరత్వం వల్లే వరకట్న మరణం జరిగిందని నిరూపించేందుకు అనువైన సామీప్య, సజీవ సంబంధాలను ప్రాసిక్యూషన్ నిరూపించాలని జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ‘సాత్విర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణా’ కేసులో శుక్రవారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ‘దీర్ఘకాలంగా పట్టి పీడిస్తున్న వరకట్న సామాజిక రుగ్మతను రూపుమాపడానికి చేపట్టిన అనేక చర్యల్లో ఐపీసీ సెక్షన్ 304-బి ఒకటి. వరకట్న దురాశ కారణంగా భర్త, ఆమె కుటుంబ సభ్యుల క్రూరత్వానికి మహిళలు లోనవుతున్నారు. ఇప్పుడూ ఈ సామాజిక రుగ్మత కొనసాగుతోందన్న విషయాన్ని విస్మరించడానికి వీల్లేదు. యూఎన్‌ఓ డ్రగ్స్, క్రైమ్ గురించి ప్రచురించిన నివేదిక ప్రకారం భారత్‌లో మహిళలపై జరుగుతున్న హత్యాచారాల్లో 40 నుంచి 50% దాకా వరకట్న చావులే ఉంటున్నాయి. 2019 నాటి ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం ఐపీసీ 304-బి కింద 7,115 కేసులు నమోదయ్యాయి. అందువల్ల ఈ సెక్షన్ కింద చెప్పిన భాషకు కట్టుబడి కేసులను పరిమిత కోణాల్లో అన్వయిస్తే ఆ సెక్షన్ ఉద్దేశమే దెబ్బతింటుంది. వరకట్న నిరోధానికి పార్లమెంటు చేసిన చట్టాన్ని, ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృతకోణంలో ఐపీసీ 304-బి సెక్షన్‌ను అన్వయించాలి. నేరంలో ఏయే అంశాలు ఇమిడి ఉన్నదీ ప్రాసిక్యూషన్ తొలుత నిరూపించాలి. ఈ సెక్షన్‌లో పేర్కొన్న సూన్ బిఫోర్ అన్న పద బంధాన్ని కేవలం మరణానికి ముందు చోటు చేసుకున్న అంశాలని మాత్రమే అర్థంకాదు. సదరు మహిళ మరణం ఆత్మహత్యగానో, ప్రమాదవశాత్తు జరిగిందనో చెప్పి తప్పించుకొనేందుకు అవకాశం కల్పించకూడదు. ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 113-బి, ఐపీసీ సెక్షన్ 304బికున్న ప్రత్యేక గుణాలను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తులు, ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు విచారణ సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. సీఆర్‌పీసీ సెక్షన్ 313 కింద ట్రయల్ కోర్టులు నిందితులను ప్రశ్నించకుండా చాలా ఉదాసీనంగా వారి స్టేట్‌మెంట్లు నమోదు చేయడం ఆందోళనకరం. ఈ సెక్షన్ కింద నిందితుడి ఎగ్జామినేషన్‌ను తప్పనిసరి తంతుగా భావించడానికి వీల్లేదు. పూర్తి నిజాయితీతో ఈ అంశాన్ని చేపట్టాలి. ఈ సమయంలో నిందితుడి నుంచి నేరనిరూపణకు సంబంధించిన విషయాలు ఎన్నో బయటపడటానికి వీలుంటుంది. అందువల్ల న్యాయస్థానాలు నిందితులను చాలా జాగ్రత్తగా, అప్రమత్తతతో ప్రశ్నించాలి. న్యాయస్థానాలు నిందితుడి నేరాన్ని నిరూపించే పరిస్థితులు కల్పించి దానిపై అతని స్పందన తెలుసుకోవాలి. ఇదే సమయంలో ట్రయల్ కోర్టులు అన్ని ముఖ్యాంశాల మధ్య సమతౌల్యం పాటించాలి. ట్రయల్‌ను వేగంగా ముగించాలి. వరకట్న చావుల కేసుల్లో ఉన్న సంక్లిష్టతలను అడ్డుపెట్టుకొని కేసు విచారణను జాప్యం చేయడానికి వేసే ఎత్తుగడలను అనుమతించకూడదు. దేశంలో రోజురోజుకీ వరకట్న రుగ్మత పెరిగిపోతోందనడంలో సందేహం లేదు. కొన్నిసార్లు నేరంలో భర్తవైపు కుటుంబ సభ్యులకు క్రియాశీలక పాత్రలేక పోయినా, వారు దూరంగా నివసిస్తున్నా ఇందులోకి లాగుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం పేర్కొంది.
వరకట్న కేసులపై జస్టిస్.ఎన్.వి.రమణ ధర్మాసనం కీలక తీర్పు
Related tags :