తానా 2021 ఎన్నికల్లో మొత్తం ముద్రించి తపాలా ద్వారా బట్వాడా చేసిన బ్యాలెట్ల సంఖ్య 33875. ఒక కుటుంబంలో భార్యా-భర్తలు ఉంటే వారిద్దరి బ్యాలెట్‌కు కలిపి ఒక కవరు. అలా అధికారికంగా బయటకు వెళ్లిన కవర్ల సంఖ్య 17758. కానీ తానా ఎలక్షన్ కమిటీకి తిరిగి వచ్చిన కవర్లు 10877. చిరునామా సరిలేక తపాలా బట్వాడా చేయలేకపోయిన కవర్లు 1433. మొత్తం 10877+1433 = 12310. అనంతవాయువుల్లో కలిసి ఎటు పోయాయో తెలియని మిగతావి 5448 కవర్లు. అంటే సుమారుగా 32శాతం. ఎందుకు ఈ సరళి?
* తానా అని గూగుల్‌లో కొడితే సంస్థ చేసే మంచి కన్నా లోలోపల జరిగే లుకలుకలే ప్రధానంగా కనిపిస్తాయి.
* ఆపద కలిగినప్పుడు మొట్టమొదట ఫోన్ మోగే సంస్థ తానా. కానీ ఈ విషయాలు తానా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే తప్ప తెలియని పరిస్థితి.
* యూట్యూబ్‌లో తానా పేరిట వెదికితే అశ్లీల సంభాషణలు, అసభ్య పదజాలం లేదా మహాసభల్లో రాజకీయ నేతల సందడి తప్ప సంస్థ చేసే అఖండమైన సేవా కార్యక్రమాలపై ఎడారిలో ఎండమావి మాదిరి అక్కడక్కడ ఒక మంచి వీడియో.
* అమెరికాకు వచ్చే యువతను తానాలో సభ్యత్వం ఉందా అని అడిగితే మహాసభల్లో ఫలానా హీరో-హీరోయిన్లను కలవొచ్చా అని అడిగే పరిస్థితికి తానా పేరు వచ్చిందంటే ఎవరు బాధ్యులు? అసలు సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటే ఉండే ప్రయోజనాలపై ప్రచారం ఏది?
* రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావుడిగా కొత్త సభ్యులను జేర్పించుకునే సదరు పదవీ ప్రేమికుల హస్తలాఘవం కూడా ఈ మిస్సింగ్ బ్యాలెట్ కవర్ల కథలో కీలక సూత్రధారులు.
* నిబద్ధత లేని సేవకులు లేక కాదు, చేయడానికి నిధులు లేక కాదు. చెడు వెళ్లిన వేగంగా మంచి వెళ్లదు. అదొక ప్రధాన కారణం.
* ఫలానా కుటుంబానికి తానా సంస్థ సాయం అంటే ఒక్కడు చదవడు. తానాలో హీరోయిన్ల సందడి అంటే లక్షల్లో వీక్షకులు.
తానాపై ఉన్న చెడు శ్లేష్మాన్ని కడగాల్సిన అత్యయిక స్థితి ఈ ఎన్నికల ద్వారా నేర్చుకోవాలి. రాజకీయ పార్టీలతో అంటకాగుతూ నచ్చినవాడిని పీఠాలు ఎక్కిస్తూ ఆ కోటరీలోనే కాలహరణం జరిగే దురవస్థను ఆపాల్సిన పరిస్థితి. 5448 కవర్లలో తక్కువలో తక్కువ 10వేల ఓట్లు పోయాయంటే సంస్థ నిధులకు ఎంత నష్టం? సమయానికి ఎంత నష్టం? ఆ సభ్యులు సంస్థకు కట్టిన జీవితకాల సభ్యత్వం ద్వారా ఏమిటి ప్రయోజనం? తానా నేతలూ…ఆలోచించుకోండి. మీ అహంకారంతో పాటు కాస్తో కూస్తో సంస్థ ఉనికిని సానుకూల ధోరణిలో విస్తృతపరిచే చర్యలకు కూడా తోడ్పడండి. ఫలితాలకు నిముషాల దూరంలో ఉన్న మీరు కనీసం ఇప్పుడైనా మీ ధృతరాష్ట్ర నాటకాలు ఆపి కళ్లు తెరిచి వాస్తవానికి దగ్గరగా జరగండి. అమెరికాలో తెలుగువారికి జెండాకర్రగా నిలబడండి.
—సుందరసుందరి(sundarasundari@aol.com)