* కరోనా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీలేని కారణంగా జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది. 1. గూడూరు-విజయవాడ, 2.విజయవాడ-గూడూరు, 3.గుంటూరు-వికారాబాద్, 4. వికారాబాద్-గుంటూరు, 5. విజయవాడ-సికింద్రాబాద్, 6. సికింద్రాబాద్-విజయవాడ, 7. బీదర్-హైదరాబాద్, 8. సికింద్రాబాద్-బీదర్, 9.హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, 10. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్, 11. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ, 12. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్, 13. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, 14. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్, 15. నర్సాపూర్-నిడుదవోలు, 16.నిడుదవోలు-నర్సాపూర్, 17. గుంటూరు-కాచిగూడ, 18.కాచిగూడ-గుంటూరు, 19. ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్, 20. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్, 21. పర్బని-హెచ్.ఎస్.నాందేడ్, 22. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి, 23.విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్, 24. తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్ మధ్య నడిచే రైళ్లను జూన్ 1నుంచి 16 వరకు రద్దు చేస్తున్నామని రైల్వేశాఖ తెలిపింది.
* మే నెలలో ఎండ వేడితో పాటు ఇంధన ధరలు మండిపోయాయి. వరుస పెంపులతో వినియోగదారుల గుండెలు గుబేలన్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ ధర ఏకంగా సెంచరీ దాటేయడంతో వాహనం బయటకు తీయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నెలలో చమురు సంస్థలు 16 సార్లు ఇంధన ధరలను పెంచాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 4 వరకు పెరిగాయి. మే 3 తర్వాత నుంచి దేశంలో ఇంధన ధరలు పెరుగుతూ పోతున్నాయి. సోమవారం కూడా చమురు సంస్థలు పెట్రోల్ ధర 28-29 పైసలు, డీజిల్ ధరను 26-28 పైసల వరకు పెంచాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.23కు చేరగా.. డీజిల్ ధర 85.15గా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర గత వారమే సెంచరీ కొట్టగా.. నేడు రూ. 100.47కు చేరింది. అక్కడ డీజిల్ ధర రూ. 92.45గా ఉంది. మొత్తంగా ఈ నెలలో లీటర్ పెట్రోల్ ధరపై రూ. 3.83 పెంచగా.. డీజిల్ ధర రూ. 4.42 పెరిగింది. వ్యాట్, స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు ఈ ధరలను రోజువారీగా సవరిస్తుంటారు.
* కరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణత నమోదు చేసింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఇదే కనిష్ఠం కావడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం సంబంధిత గణాంకాలను వెలువరించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1.6 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఎన్ఎస్వో వెల్లడించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే 0.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదైంది. పొరుగు దేశం చైనా జనవరి- మార్చి త్రైమాసికంలో 18.3 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. అంతకుముందు ఏడాది (2019-20) ముఖ్యంగా తయారీ, నిర్మాణ రంగాల్లో స్తబ్దత కారణంగా దేశ జీడీపీ 4.2 శాతానికే పరిమితమైంది. ఇది 11 ఏళ్ల కనిష్ఠం. కరోనా మహమ్మారి చుట్టు ముట్టడంతో 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా 24.38 శాతం క్షీణత నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో వెలువరించిన తొలి విడత అంచనాల్లో 7.7 శాతం క్షీణతను అంచనా వేయగా.. తర్వాత దాన్ని 8 శాతం ఉంటుందని ఎన్ఎస్వో సవరించింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొంత సమయానికే లాభాల్లోకి ఎగబాకి ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ నేటి ట్రేడింగ్లో ఓ దశలో 171 పాయింట్లు లాభపడి 15,606 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 147 పాయింట్ల లాభంతో 15,582 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 514 పాయింట్లు ఎగబాకి 51,937 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.61 వద్ద నిలిచింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ పురోగతి సూచీలకు దన్నుగా నిలిచాయి. వీటితో పాటు రిలయన్స్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు రాణించడంతో సూచీలు లాభాల బాటలో పయనించాయి.