NRI-NRT

గర్భధారణకు చైనా పచ్చజెండా-తాజావార్తలు

China  Green Flags Pregnancy In Large Scale

* చైనాలో వేగంగా పడిపోతున్న జనాభా వృద్ధిరేటును కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే ఆ దేశంలోని దంపతులు మూడో బిడ్డను కనేందుకు అనుమతులు ఇవ్వనుందని ప్రముఖ వార్త సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. వేగంగా జనాభా తగ్గిపోతే భవిష్యతులో అది చైనా ఆర్థిక అభివృద్ధిపై పెనుప్రభావం చూపిస్తుందని ఇప్పటికే పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు సోమవారం జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో చర్చించినట్లు షినువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ‘ప్రతి జంట మూడో సంతానం కనేందుకు అనుమతించారు. దీనికి తగినట్లు విధానాల్లో మార్పులు చేస్తారు’ అని ఆ వార్త సంస్థ పేర్కొంది. కాకపోతే ఈ విధానం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు ఐదేళ్లలో అమలు చేయాల్సిన ప్రధాన నిర్ణయాలపై కూడా చర్చించారు. చైనా మెల్లగా దేశంలో జననాల రేటును పెంచుకుంటూ వస్తోంది. 1979లో తెచ్చిన ‘ఒక జంటకు ఒకే బిడ్డ’ నిబంధనను కొన్ని దశాబ్దాలు కొనసాగించింది. 2016లో దీనిలో మార్పులు చేసి రెండో సంతానం కనేందుకు అనుమతులు ఇచ్చింది.

* తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపు వేళల పొడిగింపు నేపథ్యంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేయాలంటూ సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది. ఇప్పటి వరకు బ్యాంక్‌ పనివేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం సడలింపు సమయాన్ని పొడిగించడంతో బ్యాంకర్ల కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 10వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. అత్యవసర సహా ప్రభుత్వం గతంలో అనుమతించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

* ఓ యువజంట వివాహబంధం విషాదాంతమైంది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దీన్ని అమ్మాయి తల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. మనస్తాపం చెందిన అబ్బాయి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ్‌బెంగాల్‌లోని బర్ధమాన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణోత్తర పరీక్షల అనంతరం శవాన్ని అప్పగించారు. అనంతరం కోపంతో రగిలిపోయిన యువకుడి తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు యువతి ఇంటిని చుట్టుముట్టారు. చనిపోయే ముందు ఆ యువకుడు ఫొటోలు పంపినా.. కాపాడేందుకు ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కనీసం తమకు సమాచారం ఇచ్చినా కాపాడుకునే వాళ్లమని వాపోయారు. ఆగ్రహంతో ఆ అమ్మాయి, ఆమె తల్లిపై దాడి చేశారు. తర్వాత బలవంతంగా ఆ యువతిని లాక్కొచ్చి నొసటన యువకుడి వేలితో తిలకం దిద్దించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యువతి తల్లి తమపై దాడికి పాల్పడ్డారంటూ స్థానిక మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

* నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ పి.సి.పంత్‌తో సమావేశమయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును ఆయన స్వయంగా వివరించారు. సీఐడీ పోలీసులు విచారణలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని.. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ రఘురామకు తెలిపినట్లు సమాచారం.

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. రోజుకో వార్త వినిపిస్తోంది. ఆయనను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని ఛోక్సీ న్యాయవాదులు ఆరోపిస్తుండగా.. లేదు లేదు గర్ల్‌ ఫ్రెండ్‌తో విందు కోసం వెళ్లి పోలీసులకు చిక్కాడని ఆంటిగ్వా ప్రధాని చెప్పారు. అయితే ఛోక్సీ వెంట అమ్మాయి ఉన్న మాట నిజమేగానీ, ఆమె ఆయన స్నేహితురాలు కాదట.. కిడ్నాప్‌ టీంలో ఆమె కూడా ఓ పాత్రధారి అట.. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది.

* ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు మార్గాలు అన్వేషిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి దీనికి ఓ పరిష్కారం లభిస్తుందన్నారు. ఆన్‌లైన్‌ తరగతులపై ఆదివారం సునీత అనే ఉపాధ్యాయురాలు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి.. ప్రభుత్వ బడుల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై పరిశీలించాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు. కేటీఆర్‌ సూచనపై స్పందించిన సబితాఇంద్రారెడ్డి ఈమేరకు ట్వీట్‌ చేశారు.

* భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దిల్లీలో భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఎంపీ బండి సంజయ్‌, తరుణ్‌ చుగ్‌, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు ఉన్నారు. ఈటలను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం ఆయన భాజపాలో చేరుతారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయిదారు రోజుల్లో ఈటల హుజూరాబాద్‌ వెళ్లి వచ్చాక భాజపాలో చేరతారని.. నియోజకవర్గానికి వెళ్లివచ్చిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి, తెరాసకు రాజీనామా చేయాలని ఈటల యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

? భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసులు 2లక్షల కన్నా తక్కువే నమోదయ్యాయి. వరుసగా 18వ రోజూ కొత్త కేసుల కన్నా రికవరీ అయినవారి సంఖ్యే అధికంగా నమోదైంది. మరోవైపు, మరణాల సంఖ్య కూడా తగ్గుతుండటం కొంత ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 2.38లక్షల మందికి పైగా కోలుకొని డిశ్చార్జి కాగా.. దేశవ్యాప్తంగా 3128 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. వరుసగా ఏడో రోజూ రోజువారీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా తక్కువే (9.07%) నమోదైంది. ఇప్పటివరకు 34.48కోట్ల పరీక్షలు చేయగా.. 21.3కోట్ల డోసులకు పైగా టీకాలు పంపిణీ చేశారు.

? కరోనా రక్కసి నుంచి బయట పడుతున్నప్పటికీ కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనబడటంతో వారికి చికిత్స అందించేందుకు కేంద్రం మరిన్ని ఆంఫోటెరిసిన్‌ -బి ఇంజెక్షన్లను కేటాయించింది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ఇంజెక్షన్లను కేటాయించిన కేంద్రం.. అదనంగా మరో 30,100 వయల్స్‌ కేటాయించింది. వీటిలో ఏపీకి 1600 వయల్స్‌.. తెలంగాణకు 1200 వయల్స్‌ చొప్పున కేటాయించింది.

?వ్యాక్సినేషన్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం ఏపీ నుంచి విదేశాలకు వెళ్లే వారికి టీకా వేయించాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున సర్టిఫికేట్‌ ఇవ్వాలని సూచించారు. వారికి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు.

?నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు ఆనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద సంస్థ కమిటీ నివేదిక అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప మిగతా మందులకు పచ్చజెండా ఊపింది. ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు వాడొచ్చని తెలిపింది. పంపిణీ కేంద్రం వద్దకు కొవిడ్‌ రోగులు వెళ్లొద్దని, వారి బంధువులే వెళ్లి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

? కరోనా సెకండ్‌ వేవ్‌తో అనేక రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతుండటంతో అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేతన జీవుల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో ఖాతా నుంచి అడ్వాన్స్‌ తీసుకొనేందుకు మరోసారి వీలు కల్పించింది. గతేడాది మార్చిలో కూడా లాక్‌డౌన్‌ సమయంలో ఈపీఎఫ్‌వో ఈ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.

? తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ సత్ఫలితాలు ఇస్తోంది. కఠిన ఆంక్షలు విధించడంతో ఉభయ రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో కొత్త కేసులు భారీగా తగ్గాయి. నిన్న 83,461శాంపిల్స్‌ పరీక్షించగా.. దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూని జూన్‌ 10వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలను పరీక్షించగా 2,524 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

?కరోనా కట్టడికి దేశంలోని పలు ప్రభుత్వాలు అమలుచేస్తోన్న లాక్‌డౌన్ ఆంక్షలు.. కరోనా వైరస్‌తో పాటు ఇతర వ్యాధుల వ్యాప్తిని తగ్గించాయని పరిశోధకులు గుర్తించారు. న్యుమోనియా, మెనింజైటిస్, సెప్సిస్ వంటి బ్యాక్టీరియల్ వ్యాధులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ లాక్‌డౌన్‌లతో భారీగా ప్రాణాలు నిలిచాయని కూడా చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

?దేశాన్ని వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. దీన్ని అధిగమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వ్యాక్సిన్ల మిక్సింగ్‌ (రెండు వేర్వేరు డోసులు తీసుకోవడం)తో పాటు ఒకే డోసు కొవిషీల్డ్‌ టీకా ఇవ్వడంపై అధ్యయనం జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. రెండు వేర్వేరు డోసులు కలిపి ఇచ్చే అంశంపై జూన్‌లో అధ్యయనం ప్రారంభం కానున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. రెండు నుంచి రెండున్నర నెలల్లో ఈ పరిశోధన పూర్తి కానున్నట్లు సమాచారం. ఇటీవల పొరపాటున 20 మందికి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, వారిలో పెద్దగా దుష్ప్రభావాలేమీ తలెత్తకపోవడంతో వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై చర్చ ప్రారంభమైంది.

?కరోనా బారిన పడిన అందరికీ బ్లాక్‌ఫంగస్‌ (మ్యూకర్‌ మైకోసిస్‌) రాదని కేంద్రం మరోసారి వెల్లడించింది. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన ఏ వ్యక్తికైనా సోకవచ్చని తెలిపింది. అయితే, మధుమేహం, క్యాన్సర్‌ వంటి వ్యాధులు కలిగి ఉన్నవారిపై దీని ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

?కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ముగియడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు పొడిగిస్తున్నాయి. బిహార్‌లో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించారు. కొన్ని సడలింపులతో జూన్‌ 8వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రకటించారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌ కూడా లాక్‌డౌన్‌ను జూన్‌ 9వరకు పొడిగించింది. వారంలో రెండు రోజులు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలుకు అవకాశం కల్పించింది. జూన్‌ 1, 7తేదీల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు కొనుగోలు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పించింది.అలాగే, జూన్‌ 1న మాత్రమే పుస్తక దుకాణాలు, స్టేషనరీలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

* నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుతో ఎక్కుమందికి లభ్ది చేకూరుతుందని నమ్ముతున్నట్లు ఆయుష్‌ కమిషనర్‌ రాములు తెలిపారు. ఈ మందును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో కలిసి మంగళగిరిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆనందయ్య ఔషధం వల్ల కొవిడ్‌ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదన్నారు. ఈ మందువల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌, నష్టం జరిగిందనేందుకూ ఆధారాలు లేవన్నారు. మరోవైపు కంటిచుక్కల మందువల్ల హాని జరగదనేందుకు కూడా ఆధారాలు లేవన్నారు. పూర్తి వివరాలు తెలిసేందుకు మరో 3 వారాల సమయం పట్టవచ్చని రాములు తెలిపారు.

* తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపు వేళల పొడిగింపు నేపథ్యంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేయాలంటూ సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది. ఇప్పటి వరకు బ్యాంక్‌ పనివేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం సడలింపు సమయాన్ని పొడిగించడంతో బ్యాంకర్ల కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 10వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. అత్యవసర సహా ప్రభుత్వం గతంలో అనుమతించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.