Movies

అనాథ పిల్లలకు సోను చేయూత

అనాథ పిల్లలకు సోను చేయూత

గత ఏడాది కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి అసంఘటిత కార్మికుల నుంచి అన్ని వర్గాల ప్రజలకు సహాయం చేస్తూ ఆదుకుంటున్న నటుడు సోనూసూద్. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా రెండోదశలోనూ కాదనకుండా సాయం చేస్తూ తన మానవతను చాటుకుంటున్నాడు. ‘‘కొవిడ్‌-19తో తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథ పిల్లల కోసం ఆర్థికంగా ఏదైనా శాశ్వత పరిష్కారం కనుగొనాలి’’ అంటున్నాడు.

తాజాగా ఈ అంశంపై మాట్లాడుతూ ‘‘ఇప్పుడున్న పరిస్థితి గురించి నాకు తెలుసు. ఇది చాలా తీవ్రమైనది. ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో సన్నిహితంగా ఉన్నాను. ఆ బాధేంటో నాకు తెలుసు. కొవిడ్‌తో కన్నవారిని పోగొట్టుకొని అనాథలైన పిల్లల కోసం, అలాగే కుటుంబాన్ని పోషించే వ్యక్తి దూరమైనవాళ్లకోసం శాశ్వతంగా పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం చేశా. చాలా వరకు రాష్ర్ట ప్రభుత్వాలు త్వరగానే స్పందించడం సంతోషంగా ఉంది. ఇప్పటికే 11, 12 రాష్ట్రాలు బాధిత పిల్లలకు ఉచిత విద్యను ప్రకటించాయి. కొంత పెన్షన్‌ ప్రకటించాయి. అయితే ఈ విషయంలో ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. కొవిడ్‌ అనాథలకు ఉపయోగపడే ప్రయత్నాలన్నిటినీ ఒకే తాటిపైకి తేవాలి. ఈ సంక్షోభానికి ఏదైనా శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక పరిష్కారం కనుగొనాలి. ఈ పరిహారం, పెన్షన్‌ను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు మాత్రమే కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో చదివేవారికి కూడా అందించాలి. ఎందుకంటే అనాథ పిల్లలు ఎక్కడున్నా వారి పరిస్థితులు ఒకేలాగే ఉంటాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను మాత్రమే ఎందుకు చూడాలి? ప్రతి పాఠశాలలోని పిల్లలకు సమాన శ్రద్ధ, పరిహారం ఇవ్వడం అనేదాన్ని సమర్థవంతంగా, కచ్చితంగా అమలు చేయాలి. ప్రస్తుతం మేం ఈ విధంగా ప్రభావితమైన పిల్లలందరికీ సంబంధించిన డేటా సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. దేశంలోని ప్రతిపౌరుడూ వ్యక్తిగతంగా తమ స్థాయిలో ఎంతోకొంత ఇతరులకు సాయం చేస్తే బాగుంటుందనేది సోనూసూద్‌ భావన. ఆర్థికంగా భరించగలిగే కుటుంబాలు కోవిడ్ అనాథపిల్లలను దత్తత తీసుకోవాలంటున్నాడు.