Health

త్వరగా నిద్రలేస్తే చాలు

త్వరగా నిద్రలేస్తే చాలు

అధిక బరువుతో ఉన్నారా? ఊబకాయులా? అయినా మధుమేహం, గుండెజబ్బు ముప్పులు తగ్గించుకోవచ్చు. అదీ చాలా తేలికగా. అదెలా అంటారా? రోజూ వీలైనంత త్వరగా నిద్ర లేచి.. ఇంటి పనులు, వ్యాయామాలకు ఉపక్రమిస్తే చాలు. ఆలస్యంగా నిద్రలేచే ఊబకాయులతో పోలిస్తే త్వరగా నిద్రలేచే వారికి మధుమేహం, గుండెజబ్బు వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు ఊబకాయంపై వార్షిక యూరోపియన్‌ కాంగ్రెస్‌లో ప్రస్తావనకు వచ్చిన పరిశోధన పేర్కొంటోంది. ఇందులో ఊబకాయులను మూడు రకాలుగా విభజించి పరిశీలించారు. 1.పెందలాడే పడుకొని త్వరగా నిద్రలేచేవారు.. 2. ఆలస్యంగా పడుకొని, పొద్దుపోయాక నిద్రలేచేవారు.. 3. కొన్నిసార్లు పెందలాడే, కొన్నిసార్లు ఆలస్యంగా పడుకొనేవారు. నిద్ర అస్తవ్యస్తం కావటం, వయసు, లింగ భేదం, శరీర ఎత్తు బరువుల నిష్పత్తి వంటి వాటితో నిమిత్తం లేకుండా ఆలస్యంగా పడుకొని, ఆలస్యంగా నిద్రలేచే ఊబకాయులకు మధుమేహం, గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు తేలటం గమనార్హం. అందువల్ల ఊబకాయ నియంత్రణలో జీవగడియారం తీరుతెన్నులకు అనుగుణంగా రోజువారీ వ్యవహారాలను మార్చుకునేలా ప్రోత్సహించటం మంచిదని భావిస్తున్నారు. ఆలస్యంగా పడుకొని, పొద్దుపోయాక లేచేవారిలో జీవగడియారం అస్తవ్యస్తం అవుతున్నట్టు, ఫలితంగా జీవక్రియలు మారిపోతున్నట్టు, నిద్ర కూడా దెబ్బతింటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఊబకాయం ఉన్నా కూడా పెందలాడే లేవటం, సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించటం ద్వారా దుష్ప్రభావాలను తగ్గించుకునే అవకాశముందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఉదయాన్నే మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తే జీవగడియారం పనితీరూ మారుతుందని సూచిస్తున్నారు. సూర్య గమనం మీదనే మన జీవగడియారం పనిచేస్తుంటుంది. వెలుతురు, చీకటిని బట్టే దీని పనితీరు కొనసాగుతుంటుంది. మెదడులోని పీయూషగ్రంథి దీన్ని నియంత్రిస్తుంటుంది. కంటికి సహజ కాంతి, ఒంటికి ఎండ తగిలేలా చూసుకుంటే జీవగడియారమూ సజావుగా పనిచేస్తుంది. కాబట్టి కిటికీకి దగ్గరగా డెస్క్‌ ఏర్పాటు చేసుకోవటం, ఇంటి నుంచి పనిచేస్తుంటే అప్పుడప్పుడు బయటకు వెళ్లటం, ఆఫీసులోనూ వీలున్నప్పుడల్లా ఆరుబయటకు రావటం, సాయంత్రం వేళల్లో డిజిటల్‌ తెరలకు దూరంగా ఉండటం ద్వారా జీవగడియారం పనితీరునూ మార్చుకోవచ్చు.