Business

రేపటి నుండి బ్యాంకు సమయాల్లో మార్పు-వాణిజ్యం

Business News - Bank Timings To Change In India

* రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సమయాలను పొడిగించడంతో రేపటి నుంచి బ్యాంకుల పని వేళలు మారనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని బ్యాంకులు పని చేస్తాయని ఎస్‌ఎల్‌బీసీ స్పష్టం చేసింది ఇవాళ అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ రాష్ట్రంలో బ్యాంకుల పని వేళలు, లాక్‌డౌన్‌ పొడిగింపుపై సమీక్షించింది. బ్యాంకు పని వేళల్లోనూ మార్పు చేయాలని పలువురు కమిటీ సభ్యులు ఎస్‌ఎల్‌బీసీకి విజ్ఞప్తి చేశారు. దీంతో వారి వినతులను సలహాలు సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎస్‌ఎల్‌బీసీ….బ్యాంకు పని వేళలను మార్పు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని బ్యాంకులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పని చేస్తున్నాయి. రేపటి నుంచి ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయం మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖాతాదారులకు సేవలు అందించాలని బ్యాంకర్లు నిర్ణయించారు.

* ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ల తయారీకి స్వస్తి పలకడంతో ఆ ఉత్పత్తి కేంద్రాలను ఇతర అవసరాలకు వాడుకుంటుంది. వాటిని గృహోపకరణ తయారీ కేంద్రాలు మార్చే కార్యక్రమాన్ని అత్యంత వేగవంతంగా చేస్తోంది. దీనిలో భాగంగానే బ్రెజిల్‌లోని మాన్యూస్‌ ప్లాంట్‌ విస్తరించేందుకు అనుమతులు సాధించింది. 62 మిలియన్‌ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు పూర్తయితే తౌబెట్‌లోని తయారీ కేంద్రాన్ని ఇక్కడికి తరలించనుంది. దీంతో ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు తయారీకి సరికొత్త ప్రొడక్షన్‌ లైన్‌ అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. బ్రెజిల్‌ లోని ప్లాంట్లు మొత్తాన్ని మాన్యూస్‌ వద్దకు చేరుస్తామని వెల్లడించింది. వాస్తవానికి ఇక్కడ 1995లో టీవీలు, మైక్రోఒవెన్‌లు, డీవీడీ ప్లేయర్‌లు తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. తౌబెట్‌లో 2005లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో మొబైల్‌ ఫోన్లు, మానిటర్లు, ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తోంది.

* మహీంద్రాకు చెందిన క్లాసిక్‌ లెజెండ్స్ సంస్థ త్వరలో జావా డీలర్‌షిప్‌లను విస్తరించనుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించగానే దీనికి సంబంధించిన పనిని మొదలుపెట్టనుంది. కఠిన పరిస్థితులు ఎదురైనా.. కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని క్లాసిక్‌ లెజెండ్స్‌ పేర్కొంది. ఇప్పటికే బుకింగ్స్‌ చేసుకొన్న వినియోగదారులకు డెలివరీల్లో ఆలస్యం కాకుండా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ఒక్కసారి రాష్ట్రాల వారీగా లాక్‌డౌన్లను తొలగించగానే బుకింగ్‌ చేసుకొన్న వారికి అత్యంత వేగంగా వాహనాలను సరఫరా చేస్తామని తెలిపింది.