Politics

జగన్ బెయిల్ రద్దుపై విచారణ-నేరవార్తలు

జగన్ బెయిల్ రద్దుపై విచారణ-నేరవార్తలు

* అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మంగళవారం పిచ్చాటూరు పోలీసులు పట్టుకున్నారు పుత్తూరు సీఐ ఈశ్వర్, స్థానిక ఎస్ఐ వంశీధర్ కథనం మేరకు మండల సరిహద్దు లోని ఎస్ బి పేట సమీపంలో అక్రమ మద్యం తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం మంగళవారం మధ్యాహ్నం ఎస్ ఎస్ బీ పేట చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించింది. ఈ క్రమంలో అటువైపు వచ్చిన పల్సర్ వాహనాన్ని తనిఖీ చేయగా 119 క్వాటర్ బాటిల్ లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మద్యం ను, వాహనదారులు పి. యువరాజు (20), డి శివ శంకర్ (20) లను అదుపులోకి తీసుకొని పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ దాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బందికి సీఐ ఈశ్వర్ రివార్డులు అందించారు.

* తిరుపతి శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. నగర పరిధిలోని 45వ డివిజన్ శివజ్యోతినగర్ సమీపంలోకి ఆదివారం రాత్రి వచ్చిన చిరుతను చూసిన జనం భయంతో హడలిపోయారు. అడవిలోంచి కాలనీలోకి ప్రవేశించిన చిరుత ఇళ్లపైకి ఎక్కి తిరుగుతూ కనిపించింది.ఈ క్రమంలో చిరుతను భయపెట్టేందుకు కొందరు బాణసంచా కాల్చారు. మరికొందరు కర్రలు చేతపట్టుకుని తరిమారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. వారం రోజుల క్రితం కపిలతీర్థం వద్ద రెండు చిరుత పిల్లలు కనిపించాయి.కాగా, ఇటీవలి కాలంలో తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా నడకదారిలో పలుమార్లు కనిపించిన చిరుతలు భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. లాక్డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో అవి అడవి నుంచి జనారణ్యంలోకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

* ముఖ్యమంత్రి బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు దాఖలు చేయాలని సీబీఐ కోర్టు గతంలోనే ఆదేశించినా… కొన్ని కారణాల వల్ల ఆయన తరపు న్యాయవాదులు మూడు వాయిదాల వరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయారు. దీంతో, గత విచారణ సందర్భంగా కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకపోయినా… విచారణను ప్రారంభిస్తామని హెచ్చరించింది. దీంతో, ఈరోజు వారు కౌంటర్ దాఖలు చేశారు.విచారణ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ… సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడని గతంలో సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించిన సందర్భాలు ఉన్నాయని రఘురాజును ఉద్దేశించి అన్నారు.రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని… ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ స్పీకర్ కు లేఖ కూడా రాశారని తెలిపారు. రఘురాజుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన అంశంలో రఘురాజుపై సీబీఐ కేసు కూడా నమోదు చేసిందని తెలిపారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాాల కోసం కోర్టును ఉపయోగించుకునే ప్రయత్నాన్ని రఘురాజు చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను కోర్టు 14వ తేదీకి వాయిదా వేసింది.