ముగిసిందనుకున్న ఉత్కంఠ మరో మలుపు తీసుకుంది. తానా 2021 అధ్యక్ష ఎన్నికల సరళిపై తమకు అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయని వీటిని అత్యవసర బోర్డు సమావేశం ఏర్పాటు చేసి చర్చించే వరకు ఫలితాల ప్రకటనను నిలుపుదల చేయవల్సిందిగా కొడాలి నరేన్ ప్యానెల్ సభ్యులు తానా బోర్డుకు, ఎన్నికల కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. జీవితకాల సభ్యుల పట్టికతో మొదలుకుని, చిరునామాల మార్పు, ఎన్నికల ప్రక్రియ తదితరాదుల్లో అడుగడుగునా పారదర్శకత లోపించిందని వీరు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కమిటీ సభ్యులు పోటీదారులకు సమయానుకూలమైన సమాచారాన్ని అందించలేదని సైతం వీరు తమ విన్నపంలో ప్రస్తావించారు. ఫిర్యాదులో పేర్కొన్న మరికొన్ని అంశాలు…
1. కౌంటింగ్ యంత్రాలను లెక్కింపుకు పూర్వం సరిగ్గా క్యాలిబ్రేట్ చేయలేదు.
2. గడువు తేదీ లోపల వచ్చిన బ్యాలెట్లను ఎందుకు ఆమోదించలేదు.
3. వైటనెర్ పెట్టిన బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియపై ముందస్తు చర్చ లేకుండా లెక్కింపు జరపడం.
4. అధికారిక కవర్లు లేని బ్యాలెట్లను లెక్కించడం.
5. ఒకే కవరులో గంపగుత్తగా వచ్చిన బ్యాలెట్లను లెక్కించడం.
పైన పేర్కొన్న అంశాలను తక్షణమే బోర్డు అత్యవసర సమావేశంలో చర్చించి బ్యాలెట్లను యంత్రాలతో గాక మనుషుల చేత లెక్కించేలా చర్యలు చేపట్టాలని నరేన్ ప్యానెల్ సభ్యులు కోరారు.