Politics

తెరాసకు ఈటెల గుడ్‌బై-తాజావార్తలు

తెరాసకు ఈటెల గుడ్‌బై-తాజావార్తలు

* తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. 19 ఏళ్ల తెరాస అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు.

* దుండిగల్‌ ఒకటి కాదు..రెండు కాదు..అక్షరాల 97 ఎకరాలు మాయమైంది. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..! నగర శివారు దుండిగల్‌లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ఆ భూమి ఎక్కడుందో..? ఏమైందో తెలుసుకోవడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. దుండిగల్‌ గండిమైసమ్మ మండలంలోని దుండిగల్‌ గ్రామ సర్వే నంబరు 684లో 425.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సుమారు 200 ఎకరాలను రాంకీ సంస్థకు కేటాయించింది. మరో 30 ఎకరాల్లో ఓ తండా వెలిసింది. మిగిలిన 195.24 ఎకరాలు ఖాళీగా ఉండాలి. రికార్డుల ప్రకారం భూమి ఉన్నట్లు చూపుతున్నా, క్షేత్రస్థాయిలో ఆమేరకు కనిపించడం లేదు. 97 ఎకరాల భూమి మాయమైంది. ఈ విషయం మూడేళ్ల కిందట రెవెన్యూ అధికారుల సర్వేలో తేలింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఇది రూ.300 కోట్లకుపైనే ఉంటుంది. ఇది ఓవర్‌ ల్యాపింగ్‌(వేరొక సర్వే నంబర్లలో కలవడం) జరిగి ఉంటుందని భావించారు. ఏ సర్వే నంబరులో కలిసింది..? ఎక్కడ ఆక్రమణకు గురైందన్న విషయం నేటికీ తేలలేదు. తాజాగా భూమిపై వివాదం రేగింది. 47 ఎకరాల భూమి సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం అలీనగర్‌ గ్రామంలో కలిసిందని స్థానిక నాయకులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో వ్యవహారం తెరపైకి వచ్చింది.

* ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందంటున్నారు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే ఈ వైరస్‌ను సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనలపై స్పందించిన ట్రంప్‌.. తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతటి విధ్వంసం సృష్టించినందుకు గానూ చైనా.. యావత్‌ ప్రపంచానికి భారీ మూల్యం చెల్లించాలని అన్నారు. ‘‘చైనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని అప్పటి ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చెప్పింది కరెక్టేనని ఇప్పుడు ‘శత్రువుల’తో సహా ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇన్ని మరణాలు, ఇంత విధ్వంసానికి కారణమైన చైనా.. అమెరికా, ప్రపంచానికి 10 ట్రిలియన్‌ డాలర్లు చెల్లించాలి’’ – డొనాల్డ్‌ ట్రంప్‌
* కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ బాధ్యతను కేంద్రమే తీసుకునేలా అందరం ఒకే స్వరం వినిపించాలంటూ ఏపీ సీఎం జగన్‌ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయా రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ జైరాం రమేష్‌ పలు ప్రశ్నలు సంధించారు. టీకాల సరఫరా అంశంపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. జగన్‌ లేఖలు రాసినట్లుగా వచ్చిన వార్త లింక్‌ను పోస్ట్‌చేస్తూ ట్విటర్‌లో కొన్ని ప్రశ్నలు సంధించారు.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2,175 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,346కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 3,821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 253 కేసులు నమోదయ్యాయి.

* అమూల్‌తో కుదిరిన ఎంవోయూపై ఈనెల 14 వరకు ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లోని అమూల్‌ సంస్థతో పాటు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఒప్పందం పూర్తి వివరాలు ఇవ్వాలని అమూల్‌, డెయిరీ బోర్డును కోర్టు ఆదేశించింది. కేసు విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

* ఓ యువ వైద్యురాలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు పోయాయని భర్త ఆరోపించారు. హైదరాబాద్‌ శివారు కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ భావన(31)కు 15 నెలల కిందట అదే ప్రాంతంలోని డాక్టర్‌ కల్యాణ్‌తో వివాహమైంది. అప్పటికే బేగంపేట సమీపంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆమె రేడియాలజిస్టుగా పనిచేస్తున్నారు. వివాహం తరువాత వృత్తికి దూరంగా ఉన్నారు. కొవిడ్‌ బారినపడటంతో ఏప్రిల్‌ 22న భావన కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ మే 6 వరకు చికిత్స పొందారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత ఏర్పడిన అనారోగ్య సమస్యల క్రమంలో.. ఎక్మో అవసరం కావడంతో జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు. 26 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆమెకు అమర్చిన ఎక్మో పైపు సరిగా లేక రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం కారిపోయిందని, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని కల్యాణ్‌ ఆరోపించారు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్‌ స్థాయి 94గా ఉందని, తర్వాత పైపు సరిగా లేకపోవడంతో 64కు పడిపోయిందని తెలిపారు. అనంతరం ఫ్లూయిడ్‌ ఓవర్‌లోడ్‌ చేయడంతో గురువారం వేకువజామున 4.30గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని పేర్కొన్నారు. ఆసుపత్రి బిల్లు రూ.52 లక్షలు చెల్లించామని, మరో రెండు వారాల్లో డిశ్ఛార్జి కావాల్సి ఉండగా ఇలా జరిగిందని వాపోయారు. ఈ ఘటనలో వైద్యులు, వైద్య సిబ్బంది వైఫల్యమేమీ లేదని, విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోయిందని ఆసుపత్రి వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

* కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకై ఉండొచ్చనే వాదనలు బలపడే కొద్దీ అమెరికాకు చెందిన అంటువ్యాధుల చికిత్స నిపుణులు ఆంటోనీ ఫౌచీపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడా విమర్శలకు ఆజ్యం పోసేలా ఫౌచీ ఈమెయిల్స్‌ బహిర్గతం అయ్యాయి. వుహాన్‌ ల్యాబ్‌లో ఏమి జరుగుతోందో నిజంగా ఆయనకు తెలియదా..? లేదా అన్నీ తెలిసే.. అబద్ధాలు చెప్పారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఫౌచీ ఈమెయిల్స్‌.. ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ రిక్వెస్ట్‌ కింద బహిర్గతం అయ్యాయి. ఇందులో కొన్ని ఈమెయిల్స్‌ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాస్కులపై ఆయన స్పందన, వుహాన్‌ ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతాన్ని కొట్టిపారేయటం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తొలి నాళ్లలో ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకించిన ఫౌచీ.. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మాట మార్చారు. ల్యాబ్‌ నుంచి లీకయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో డాక్టర్‌ ఫౌచీకి.. ఇమ్యూనాలజిస్టు క్రిస్టియన్‌ జీ అండర్సన్‌ ఒక ఈమెయిల్‌ పంపించారు. దానిలో ‘‘ వైరస్‌కు ఉన్న అసాధారణ ఫీచర్లు చూస్తేంటే దీనిని ల్యాబ్‌ సెట్టింగ్స్‌లో మార్చారేమో అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. కానీ తర్వాత ఆయనే ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతానికి ఆధారాల్లేవు అని పత్రాన్ని సమర్పించారు. మరోపక్క డాక్టర్‌ ఫౌచీ ఈ వైరస్‌ ప్రకృతి సహజంగానే జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాపించిందనే వాదనలను ప్రచారం చేశారు. శాస్త్రవేత్తలను కూడా ఈ దిశగా రాయమని ఆయన సలహా కూడా ఇచ్చారు. వాస్తవానికి ఏ జంతువు నుంచి వచ్చిందో ఇప్పటికీ తెలియదు. కానీ, తాజాగా మాత్రం ఆయన కూడా ల్యాబ్‌ లీక్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

* ఈటల రాజేందర్‌ ఆత్మగౌరవం ఏవిధంగా దెబ్బతిందో, ఎలా భంగపడ్డారో చెప్పడం లేదని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్‌ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ప్రగతిభవన్‌కు వెళితే రెండుసార్లు అపాయింట్‌మెంట్‌ దొరకలేదని చెబుతున్నారు. అవమానాలు ఎదుర్కొన్నట్లు ఈటల ఆరోపిస్తున్నారు. తెరాసలో మొదటి నుంచీ ఉన్న నేను ప్రత్యక్ష సాక్షిని. ఈటల అవమానాలు ఎదుర్కొన్నాననడం అవాస్తవం. ఈటలకు ఆత్మగౌరవం ఉంటే ఎస్సీల వద్ద కొన్న భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆత్మరక్షణ, ఆస్తుల రక్షణ కోసమే ఈటల రాజేందర్‌ భాజపాలో చేరుతున్నారు’ అని కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు.

* రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘అమూల్’ ద్వారా పాల సేకరణనును మరింత విస్తరించి పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఈ ఏడాది 2, 600 గ్రామాల్లో.. దశలవారీగా 9,899 గ్రామాల్లో పూర్తిగా అమూల్‌ను విస్తరిస్తామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా అమూల్‌ పాలసేకరణను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ అమూల్ రాకతో వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖచిత్రం మారబోతోందన్నారు. అమూల్‌కు పాలు పోయడం లాభదాయకమని.. పాడి రైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు.

* రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.93 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 24 కోట్లకు పైగా డోసులను కేంద్రం పంపిణీ చేసిందని తెలిపింది. వాటిలో కొన్ని ఉచితంగా అందించినవి, మరికొన్ని నేరుగా రాష్ట్రాలు సేకరించినవి ఉన్నాయని పేర్కొంది. మొత్తం 24 కోట్లకు పైగా డోసుల్లో 22,27,33,963 డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగించాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వృథా అయిన డోసులు కూడా ఆ లెక్కలోనే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1,93,95,287 డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పింది.

* భారత్‌లో మొదటిసారి వెలుగుచూసిన బి.1.617 విభాగంలోని మూడు వేరియంట్లలో డెల్టా రకంగా పేర్కొంటున్న బి.1.617.2 వేరియంటే రెండో దశ విజృంభణకు మూల కారణమని ప్రభుత్వ అధ్యయనమొకటి తేల్చింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఆల్ఫా వేరియంట్‌ కంటే డెల్టా వేరియంటే వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంది. భారత్‌లో దాదాపు 12,200 వేరియంట్లు ఉన్నాయని వాటిలో డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరమైందని తెలిపింది. భారత జీనోమిక్‌ కన్సార్షియా, జాతీయ వ్యాధి నియంత్రణా కేంద్రం(ఎన్‌సీడీసీ) కలిసి నిర్వహించిన జన్యుక్రమ విశ్లేషణ అధ్యయనంలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఇప్పట్లో కన్పించట్లేదు. ఆంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికా పోలీసులకు చిక్కిన ఛోక్సీకి సంబంధించి రెండు కేసులు అక్కడి న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయి. ఆ కేసుల్లో తీర్పు వచ్చేంతవరకు ఛోక్సీని పంపించే అవకాశం లేదు. దీంతో ఆయనను తీసుకొచ్చేందుకు వెళ్లిన భారత దర్యాప్తు సంస్థల బృందం స్వదేశానికి తిరుగు పయనమైంది. గత నెల 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన ఛోక్సీని ఆ తర్వాత రెండు రోజులకు పక్కనే ఉన్న డొమినికా దేశంలో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.