రామ్‌రాజ్ కాటన్ సంస్థ ముద్రతో నకిలీ మాస్కులు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు సంస్థ యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘తమిళనాడులోని తిరుప్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న రామ్‌రాజ్ కాటన్ సంస్థ పంచె, చొక్కా, మాస్కులు, లోదుస్తుల ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాస్కుల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దీనిపై విచారించినప్పుడు కావలి, ఒంగోలు పట్టణాలకు చెందిన కొంతమంది రామ్‌రాజ్ కాటన్ సంస్థ ముద్రను ఉపయోగించి నకిలీ మాస్కులు తయారుచేసి భారీగా విక్రయిస్తున్నట్లు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ చేపట్టిన పోలీసులు కొంతమంది ముఠా సభ్యులను అరెస్టుచేయడంతో పాటు నకిలీ మాస్కులను, వాటిని తయారుచేసేందుకు ఉపయోగించిన ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు’ అని సంస్థ వెల్లడించింది. ఈ విషయమై రామ్‌రాజ్ కాటన్ వ్యవస్థాపకులు కె.ఆర్.నాగరాజన్ స్పందిస్తూ.. ‘కరోనా నుంచి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా మూడు పొరల మాస్కులను రామ్‌రాజ్ సంస్థ తయారుచేస్తుంది. నాణ్యమైన ఈ మాస్కులను సంస్థ షోరూములు, అనుమతులు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలి. నకిలీల మాయలో పడి మోసపోవద్దు’ అని విజ్ఞప్తిచేశారు.
రామరాజ్ కాటన్ నకిలీ మాస్క్‌లు
Related tags :