శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం చూపుతున్న కొవిడ్-19 మహమ్మారి.. చర్మాన్ని కూడా వదిలిపెట్టడంలేదు. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్నవారికి హెర్పిస్ ఇన్‌ఫెక్షన్ తిరగబెట్టడం నుంచి జుట్టు రాలిపోవడం, గోళ్ల సమస్యలు వరకూ.. అనేకరకాల చర్మ రుగ్మతలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. రోగ నిరోధక శక్తి తగ్గడమే ఇందుకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన కొవిడ్ బాధితులు, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నవారు చర్మ ఇన్‌ఫ్లమేషన్‌కు సంబంధించిన లక్షణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, అవి మరీ ఇబ్బంది పెడితే వైద్యులను సంప్రదించాలని సూచించారు. దిల్లీ ముంబయికి చెందిన చర్మ వైద్యులు డి.ఎం.మహాజన్, సొనాలీ కోహ్లి, నిధి రోహత్గీ పేర్కొన్న అంశాలివీ..
* కొవిడ్ నుంచి కోలుకున్నాక అనేకమంది చర్మ సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారు. మ్యుకర్‌మైకోసిస్ సోకిందేమోనన్న ఆందోళన వారిలో ఎక్కువగా ఉంటోంది. ఈ విషయంలో అప్రమత్తత మంచిదే కానీ ఆదుర్దా అనవసరం.
* కొవిడ్ బాధితుల్లో హెర్పిస్‌కు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. వీరిలో అనేకమందికి గతంలో ఈ రుగ్మత ఉండేది. కరోనా వల్ల ఇప్పుడు అది పునరావృతమవుతోంది. మరికొందరిలో అది కొత్తగా వస్తోంది.
* హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్‌ఎస్‌వీ) వల్ల హెర్పిస్ లేబియాలిస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. హెచ్‌ఎస్‌వీ-1 లేదా హెచ్‌ఎస్‌వీ-2 వల్ల ఇది తలెత్తవచ్చు. దీనివల్ల పెదవి చుట్టూ నీటి పొక్కుల్లాంటివి వస్తాయి. విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. దీనికితోడు వారిసెల్లా-జోస్టర్ వైరస్ తిరిగి క్రియాశీలమై హెర్పిస్ జోస్టర్ అనే ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తోంది. దీనివల్ల చర్మంపై చెల్ది పొక్కులు వస్తాయి. కొవిడ్ బాధితుల్లో హెచ్‌ఎస్‌వీ కన్నా హెర్పిస్ జోస్టర్ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. కొవిడ్ నుంచి కోలుకున్న నెల తర్వాత కూడా కొందరిలో ఇలాంటివి తలెత్తుతున్నాయి.
* క్యాండిడా ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కూడా ఉత్పన్నమవుతోంది. దీనివల్ల మర్మావయవాల వద్ద తెల్లటి పొక్కులు వస్తుంటాయి. మితిమీరి ఔషధాలు, స్టెరాయిడ్లు వాడటం వల్ల ఇది ఉత్పన్నం కావొచ్చు.
* గోళ్ల విషయానికొస్తే ఎక్కువగా మెలనోనైకియా లేదా బ్యూ లైన్స్ కేసులు కనిపిస్తున్నాయి. దీనివల్ల గోళ్లపై తెల్లటి లేదా గోధుమ వర్ణపు గీతలు వస్తుంటాయి.
* కొవిడ్ అనంతరం జుట్టు రాలిపోయే సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఉంటోంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించాలి.
* కొందరిలో చికిత్స సమయంలో, మరికొందరిలో కోలుకున్నాక చర్మ సమస్యలు వస్తున్నాయి. నుదురు, వీపుపై మచ్చలు రావొచ్చు. చాలావరకూ అవి చిన్నపాటి పొక్కులే. సరైన ఆయింట్‌మెంట్ రాస్తే త్వరగా మానిపోతాయి.
* పిటిరియాసిస్ రోసా అనే రుగ్మత కూడా ఉత్పన్నమవుతోంది. దీనివల్ల శరీరంపై ఒక పెద్ద మచ్చ, దానిచుట్టూ చిన్న మచ్చలు వస్తుంటాయి.
మర్మాంగాల వద్ద చర్మ సమస్యలకు కారణమవుతున్న కరోనా
Related tags :