ధాన్యం కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న ఆలస్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డెక్కి నిరసన తెలపడంతో పాటు ధాన్యాన్ని తగలబెట్టారు. మరో రెండు ఘటనల్లో ఐకేపీ కేంద్రాల నిర్వాకంతో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వికారాబాద్, మెదక్ జిల్లాల్లో సోమవారం జరిగిన ఘటనలు అన్నదాతల అవస్థలకు అద్దం పట్టాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలేపల్లిలో ఏర్పాటుచేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రాక సోమవారం తూకాలు నిలిపివేశారు. దీంతో రైతులు ఆగ్రహించారు. కేంద్రం ఆవరణలో ధాన్యం కుప్పలుగా పోసి వేచిచూస్తున్నా కొనుగోళ్లు జరపకపోవడ[మేంటని నిలదీశారు. నిరసన వ్యక్తం చేసేందుకు ఉదయం 9 గంటలకే రోడ్డెక్కారు. స్పందించిన కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని పరిగిలోని రైస్ మిల్లర్లకు అమ్ముకోవాలని సూచించగా రైతులు నిరాకరించారు. 15 కి.మీ.ల దూరంలో ఉన్న అక్కడికి ఎలా వెళ్తామని ప్రశ్నిస్తూ ఆందోళనను ఉద్ధృతం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతు వెంకటయ్య వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ ‘కొనేట్లు చూడండి సారూ’ అంటూ ఎస్‌ఐ కాళ్లు పట్టుకోవడం అందర్నీ కలిచివేసింది. తహసీల్దార్ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని అన్నదాతలు భీష్మించారు. తహసీల్దార్ వచ్చి సర్దిచెప్పినా అన్నదాతలు వినలేదు. కొనుగోళ్లు వెంటనే నిర్వహించాలని పట్టుబట్టారు. ధాన్యం బస్తాలను తగలబెట్టడంతోపాటు రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. ‘ధాన్యాన్ని వాహనాల్లో పరిగిలోని రైస్ మిల్లులకు తీసుకెళ్లండి. అద్దె ఇప్పిస్తాం’ అని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో చివరకు కర్షకులు ఆందోళన విరమించారు.
ధాన్యం తగలబెట్టిన కడుపు మండిన రైతన్న
Related tags :