Kids

మంచికి మంచి-చెడుకి చెడు:చిన్న నీతి కథ

మంచికి మంచి-చెడుకి చెడు:చిన్న నీతి కథ

రవి చానా అల్లరి పిల్లోడు. వాడు ఒక రోజు ఊరి బైటున్న కొండలకాడికి పోయి గట్టిగా ‘ఓ’ అని అరిచాడు. వెంటనే వానికి మళ్ళా ‘ఓ’ అనే అరుపు తిరిగి వినిపించింది. రవి ఈ సారి “రేయ్… వెధవా” అని మళ్ళా గట్టిగా అరిచాడు. వెంటనే వానికి మళ్ళా అదే మాట తిరిగి వినిపించింది. దాంతో వాడు కోపంగా ఒక గబ్బు తిట్టు తిట్టాడు.. అదే గబ్బు తిట్టు వానికి మళ్ళా వినిపించింది.

రవి ఆ కొండలోపల ఎవరో దాచి పెట్టుకొని వున్నారనీ వాడు తనని తిరిగి తిడుతున్నాడనీ అనుకున్నాడు. ఇంటికి పోయి అమ్మతో సంగతంతా చెప్పాడు. వాళ్ళమ్మ నవ్వి “ఈ సారి మళ్ళా పోయి మంచిగా పిలువు” అని చెప్పింది.

వాడు మళ్ళా ఊరి బైటికి పోయి “హలో… బాగున్నావా” అంటూ అరిచాడు. వెంటనే వానికి “హలో… బాగున్నావా” అని మళ్ళా వినబడింది. రవి నవ్వుతూ సంతోషంగా “నేను నీవూ స్నేహితులం” అంటూ గట్టిగా అరిచాడు. వానికి వెంటనే “నేను నీవు స్నేహితులం” అని అదేమాట తిరిగి వినబడింది. రవి ఆనందంగా ఉరుక్కుంటా ఇంటికి పోయి “అమ్మా… మేము స్నేహితులం… తెలుసా” అని సంబరంగా చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ రవిని దగ్గర కూచోబెట్టుకోని “నాయనా… మనం ఎదుటి వారితో ఎట్లా మాట్లాడుతామో… ఎదుటివారు గూడా మనతో అట్లే మాట్లాడుతారు. మనం మంచిగా వుంటే అందరూ మనతో మంచిగా వుంటారు. చెడుగా ఉంటే చెడుగా వుంటారు” అని చెప్పింది. అప్పటి నుండీ రవి అందరితో కలసిమెలసి మంచిగా వుండడం నేర్చుకున్నాడు.