* కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని ఆయనకు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం..రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్, పునరావాస పనులను.. 2022 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. జాతీయ ప్రాజెక్ట్‌ల విషయంలో వాటర్ సప్లయ్‌ని…ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా చూడాలని, పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్రప్రభుత్వ వనరుల నుంచి ఖర్చు చేస్తున్నామని.. జాప్యం లేకుండా ఆ నిధులను రీయింబర్స్ చేయాలని కోరారు. రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌వైజ్ ఎలిజిబిలిటీకి పరిమితం చేయొద్దన్నారు. పునరావాస పనులకు కూడా రీయింబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని…హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.
* సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కావాలంటే తన ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఎంచుకోవచ్చని ప్రకటించింది. అంతేకాదు కరోనా సంక్షోభం కారణంగా వారు ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే అందుకు తగిన సహాయం చేస్తామని కూడా ప్రకటించింది. అమెరికాలో దాదాపు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావడం, త్వరలోనే అన్ని కార్పొరేట్ క్యాంపస్‌లలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ తాజా ప్రకటన చేసింది.
* టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ తన వివాహంపై చేసిన ప్రకటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదన్నారు. అసలు తమది వివాహమే కాదని.. సహజీవనం కిందకు వస్తుందని ప్రకటనలో తెలిపారు. దీనిపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తుంది. వివాహం విషయంలో నుస్రత్ పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పారని విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ‘‘నుస్రత్ జహాన్ వ్యక్తిగత జీవితం గురించి, ఆమె ఎవరిని వివాహం చేసుకున్నారు.. ఎవరితో కలిసి ఉంటున్నారనే దాని గురించి మేం మాట్లాడటం లేదు. కానీ ఆమె ప్రజలు ఎన్నుకొన్న ఓ ప్రజాప్రతినిధి. పార్లమెంట్ రికార్డుల్లో ఆమె నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకున్నట్లు ఉంది. అంటే ఆమె పార్లమెంట్ సాక్షిగా అబద్ధం చెప్పారా’’ అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి వీడియోను ట్వీట్ చేశారు.
* ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ సందర్భంగా పది మంది దిగ్గజ ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చాలని ఐసీసీ నిర్ణయించింది. క్రికెట్ ఐదు శకాల నుంచి ఇద్దరేసి ఆటగాళ్లకు ఈ గౌరవం దక్కనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో 93 మంది దిగ్గజ ఆటగాళ్లుండగా, ఆ సంఖ్యను 103కు పెంచాలని నిర్ణయించింది. జూన్ 18న సౌథాంప్టన్‌లో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్పెషల్ ఎడిషన్ ఉంటుందని గురువారం ఐసీసీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
* మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి జితిన్ ప్రసాద బీజేపీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన 24 గంటల వ్యవధిలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సమాచారం. అప్నా దళ్ ఎంపీ అనుప్రియా పటేల్ కూడా గురువారం సాయంత్రం 5 గంటలకు అమిత్ షాను కలిశారు.
* మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారయ్యింది. ఈ నెల 14న ఆయన కాషాయ కండువా కప్పుకొనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు. ఈటలపై భూ కబ్జా ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు వెడేక్కాయి. కావాలనే కక్ష్య కట్టి కేసీఆర్ ఇదంతా నడిపిస్తున్నారని ఈటల ఆరోపించారు. పార్టీలో అవమానాలు తప్ప ఆత్మీతయత లేదని వాపోయారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు.
* విద్యార్థులకు ’జగనన్న విద్యా కానుక’ ద్వారా పంపిణీ చేసే స్టూడెంట్ కిట్లలో వస్తువుల నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47.32 లక్షల మందికిపైగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కోసం 2021– 22 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.731.30 కోట్లను వ్యయం చేస్తోంది. విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగుతోపాటు ఈసారి ఇంగ్లీషు–తెలుగు నిఘంటువులను కిట్ రూపంలో అందించనున్నారు. విద్యా కానుక ద్వారా అందచేసే వస్తువులు 100 శాతం నాణ్యంగా ఉండేలా పరస్పర సహకారంతో పర్యవేక్షించే బాధ్యతను స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎమ్, మండల విద్యాశాఖాధికారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అప్పగించారు. ఈ నేపథ్యంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతోంది.
* తిరుమలలో అద్దె గదుల కోసం సాధారణ భక్తులకు ఇక్కట్లు తప్పనున్నాయి. గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జీఎన్‌సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, రామ్ భగీచ, ఎంబీసీ, సీఆర్‌వో వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్ ద్వారా గదుల సమాచారం చేరుతుంది. ఎస్‌ఎంఎస్ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8గంటలకు రిజిస్ట్రేషన్ కేంద్రాలను తితిదే అధికారులు ప్రారంభించనున్నారు.