అమెరికా వెళ్లేందుకు సన్నద్ధం కండి!
సోమవారం నుంచి విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభం
జులై, ఆగస్టులో తరగతులు ప్రారంభమయ్యేవారికి ప్రాధాన్యం
అపాయింట్‌మెంట్ రద్దయితే దరఖాస్తు చేసుకోండి
రాయబార కార్యాలయం వెల్లడి
హైదరాబాద్: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. సోమవారం నుంచి విద్యార్థి వీసా ప్రక్రియను ప్రారంభించనున్నట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కాన్సులర్ వ్యవహారాల మంత్రి డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఈ విషయాన్ని గురువారం ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. పర్యాటక వీసాలైన బి1/బి2 కోసం ఎదురుచూస్తున్న వారు మరి కొంతకాలం వేచి ఉండకతప్పని పరిస్థితి.