Politics

జస్టిస్ ఎన్.వి.రమణకు తెలంగాణా ప్రభుత్వం ఘనస్వాగతం-తాజావార్తలు

జస్టిస్ ఎన్.వి.రమణకు తెలంగాణా ప్రభుత్వం ఘనస్వాగతం-తాజావార్తలు

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణకు శంషాబాద్‌ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు సీజేఐకు స్వాగతం పలికారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,01,863 పరీక్షలు నిర్వహించగా.. 8,239 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,96,122 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 61 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,824కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,135 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,88,198కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,02,39,490 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,396 కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 కేసులు నమోదయ్యాయి.

* నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌ క్వాలిఫై చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైకాపా మరోసారి ఫిర్యాదు చేసింది. వైకాపా టికెట్‌పై నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజు పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా చీఫ్ విప్‌ మార్గాని భరత్‌ ఫిర్యాదు చేశారు.

* రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. కొవిడ్‌ కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రికి వివరించారు. మరో రెండు నెలలపాటు ఉచిత బియ్యం పంపిణీని కేంద్రం పొడిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. 2015 డిసెంబర్‌ వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఏపీలో 1.29 కోట్ల రేషన్‌ కార్డులకు 1,85,640 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయిస్తున్నట్లు జగన్‌ తెలిపారు.

* గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని నాలాలపై అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. వర్షాకాల సన్నద్ధతపై మంత్రి మహమూద్‌ అలీతో కలిసి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. 1,360 కిలోమీటర్ల మేర రూ.45 కోట్ల వ్యయంతో ఏటా నాలాల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పూడికతీత కోసం త్వరలోనే యంత్రాలు సమకూర్చుతామని వెల్లడించారు. కొన్ని చోట్ల నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. వాటిని గుర్తించి తొలగిస్తామన్నారు.

* బెయిల్‌ రద్దు భయంతో కేసుల మాఫీ కోసం కేంద్ర పెద్దల ముందు సాష్టాంగ పడేందుకే సీఎం జగన్‌ దిల్లీ పర్యటన తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పర్యటనకు సంబంధించిన వివరాలు ప్రజలకు వెల్లడించకపోవడంతోనే లోపాయికారి ఒప్పందమనే విషయం బహిర్గతమవుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు యనమల ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో సరైన కార్యాచరణ, ప్రణాళిక లేదని విమర్శించారు. విభజన హక్కుల సాధనలో సీఎం జగన్‌, వైకాపా ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారన్నారు.

* కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాల కారణంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100కు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఏడాదిలోనే పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.24 పెరిగిందని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు దిగింది. నేతలు, కార్యకర్తలు పెట్రోల్‌ బంకుల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద చేపట్టిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు నేతలు పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్‌ యాదవ్‌, దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు.

* లక్షద్వీప్‌లో సినీ దర్శకురాలు ఐషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌ను కేంద్రం పంపిన జీవాయుధమని, కొవిడ్‌ను కట్టడి చేయడంలో ఆయన విఫలమయ్యారంటూ టీవీ చర్చలో భాగంగా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అక్కడి భాజపా అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై ఈ కేసు నమోదైంది. గత ఏడాది మొత్తం ఒక్క కరోనా కేసు సైతం నమోదుకాని లక్షద్వీప్‌లో ఇప్పుడు బయటివారి రాకపోకలు పెరిగి దాదాపు 7,000 కేసులు నమోదయ్యాయి. కేవలం 65వేల జనాభాగల ఈ దీవుల్లో కరోనా పాజిటివ్‌ రేటు ప్రస్తుతం దేశంలోనే అత్యధికం. ఈ క్రమంలో ఐషా.. టీవీ చర్చలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

* ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నేడు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో సమావేశం కానున్నారు. ముంబయిలోని పవార్‌ నివాసంలో వీరి భేటీ జరగనుంది. ఇటీవల జరిగిన బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్ తన వ్యూహాలతో మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరివురికి మద్దతు ప్రకటించిన నేతలందరినీ కలిసి ప్రశాంత్‌ కృతజ్ఞతలు తెలపనున్నారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే నేడు పవార్‌ను కలుస్తున్నట్లు పేర్కొన్నాయి. కానీ, రాజకీయ వర్గాల్లో మాత్రం పవార్‌, ప్రశాంత్‌ భేటీ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది.

* ఐటీ రంగ షేర్ల అండతో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఐటీ రంగ షేర్లతో పాటు రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 52,642 వద్ద, నిఫ్టీ 15,835 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. తర్వాత బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో గరిష్ఠాల నుంచి దిగొచ్చాయి. అయినప్పటికీ లాభాల్లోనే కొనసాగాయి. చివరకు సెన్సెక్స్‌ 174 పాయింట్ల లాభంతో 52,474 వద్ద ముగియగా.. నిఫ్టీ 61 పాయింట్లు ఎగబాకి 15,799 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.06 వద్ద నిలిచింది.

* తనపై జరుగుతున్న అన్ని విచారణలను మహారాష్ట్ర వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ ముంబయి మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 30ఏళ్లకు పైగా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్‌ అధికారి తన సొంత రాష్ట్ర పోలీసులనే నమ్మకపోవడం దిగ్భ్రాంతికరమని పేర్కొంది. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌.. పోలీసు అధికారి సచిన్‌ వాజేకు ప్రతి నెలా రూ.100కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరమ్‌ బీర్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన హోంగార్డ్‌ డీజీగా బదిలీ అయ్యారు. మరోవైపు ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.

* సచిన్‌ పైలట్‌ భాజపాలో చేరతారంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్‌ స్పందించారు. ఈ విషయంపై తాను సచిన్‌తో మాట్లాడానని రీటా చెప్పగా.. ఆమెకు తనతో మాట్లాడే ధైర్యం లేదని ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘సచిన్‌తో మాట్లాడానని రీటా బహుగుణ చెప్పారు. ఆమె సచిన్‌ తెందూల్కర్‌తో మాట్లాడి ఉండొచ్చు. నాతో మాట్లాడే ధైర్యం ఆమెకు లేదు’ అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు.

* ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భాజపా రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర మాజీ మంత్రి రామ్‌విచార్‌ నేతమ్‌ క్రెడిట్‌ కార్డుతో గుర్తు తెలియని వ్యక్తి లావాదేవీలు జరిపాడు. దీంతో ఆయన కార్డు నుంచి రూ.37వేలు దుర్వినియోగమైనట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని తెలిబండ పోలీస్‌ స్టేషన్లో గురువారం రాత్రి ఎంపీ బంధువు ఒకరు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంపీ పేరిట ఉన్న క్రెడిట్‌కార్డును దుర్వినియోగపరిచిన మోసగాడు రూ.36,844ల మేర లావాదేవీలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న క్రెడిట్‌ కార్డు నుంచి లావాదేవీ జరిగినట్టు వివరించారు.