Health

భారత బయొటెక్‌కు FDA బ్రేకులు-TNI కోవిద్ బులెటిన్

భారత బయొటెక్‌కు FDA బ్రేకులు-TNI కోవిద్ బులెటిన్

* భారత్‌ బయోటెక్‌కు అమెరికాలో భారీ షాక్‌ తగిలింది. సంస్థ అభివృద్ది చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్‌, యూఎస్‌ భాగస్వామ్య కంపెనీ ఆక్యుజెన్‌తో ప్రతిపాదనలను బైడెన్‌ సర్కార్‌ నిరాకరించింది. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్‌ కోవాగ్జిన్‌ను చేర్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. అత్యవసర వినియోగానికి బదులు బయోలాజిక్స్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌(బీఎల్‌ఏ) సమర్పించాలని సూచించింది. అయితే బీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకోవాలంటే టీకా గురించి మరింత సమాచారాన్ని అందించాలి. ఈ నేపథ్యంలోనే భారత్‌ బయోటెక్‌ అక్కడ కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,08,616 పరీక్షలు నిర్వహించగా.. 6,952 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,03,074 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 58 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,882కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,577 మంది బాధితులు పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16,99,775 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,03,48,106 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,199 కేసులు, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కేసులు నమోదయ్యాయి.

* ఓవైపు దేశవ్యాప్తంగా చాలా చోట్ల కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడుతుండగా.. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల కొద్దీ టీకాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. గత నెలల్లో ప్రైవేటు ఆసుపత్రులు కేవలం 17శాతం డోసులను మాత్రమే వినియోగించినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది.