* భారతదేశపు అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ఏజెన్సీ వాజిర్‌ఎక్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సుమారు 2,790 కోట్ల రూపాయల ట్రాన్‌జాక్షన్స్‌పై ఉల్లంఘనలకు పాల్పడిందని వాజిర్‌ఎక్స్‌పై ఆరోపణలు ఉన్నాయి.
* ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్‌కి మరింత ఊతం ఇచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్ తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గి అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
* కరోనా రెండో దశ ఉద్ధృతితో ఆందోళనలో ఉన్న ప్రజలకు ఊరట కల్పిస్తూ వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనాపై పోరులో ఉపయోగించే ఔషధాలు, వైద్య పరికాలు సహా ఇతర సామగ్రిపై పన్నులు తగ్గించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఔషధాలపైనా పన్నులు కుదించారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలి భేటీ అయ్యింది. భేటీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కొత్తగా నిర్ణయించిన ఈ పన్ను రేట్లు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉంటాయి. కరోనా వ్యాక్సిన్లపై ఉన్న 5 శాతం జీఎస్టీని అలాగే కొనసాగించనున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. టీకాలపై జీఎస్టీని పూర్తిగా తగ్గించడం వల్ల ఔషధ సంస్థలు తయారీ ఖర్చుల పేరిట వినియోగదారులపై భారం మోపే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేయనున్న నేపథ్యంలో జీఎస్టీని సైతం కేంద్రమే భరించనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం వాటాను తిరిగి రాష్ట్రాలకే కేటాయింపుల ద్వారా పంచనున్నామని ఆమె తెలిపారు.
* అసలే కరోనా మహమ్మారితో కష్టకాలంలో ఉన్న సామాన్యులకు ఇంధన ధరలు మరింత భారమవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ కొట్టి పరుగులు పెడుతుండగా.. ఇప్పుడు డీజిల్ కూడా రూ.100 మార్క్ దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు ఉత్పత్తి సంస్థలు శనివారం మరోసారి పెంచాయి. పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 23 పైసలు పెరిగింది. దీంతో రాజస్థాన్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్ జిల్లాలో లీటర్ డీజిల్ ధర రూ.100.05గా ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర కూడా అత్యధికంగా రూ.107.22కు చేరింది.