Business

బైకుల సేల్స్ ఢమాల్. గుడ్ల అమ్మకాలు భేష్-వాణిజ్యం

బైకుల సేల్స్ ఢమాల్. గుడ్ల అమ్మకాలు భేష్-వాణిజ్యం

* సీజన్స్‌తో, సంక్షోభాలతో, సమస్యలతో సంబంధం లేకుండా డబ్బు అవసరమైన వారిని ఆదుకునేది ఏదైనా ఉందా అంటే అవి బ్యాంకులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు కోసం బ్యాంకులు పర్సనల్ లోన్ ఇస్తాయి. అలాగే, కొత్త ఇల్లు కొనుక్కోవాలి అన్న హోమ్ లోన్ పేరుతో బ్యాంకలు రుణాలు అందిస్తాయి. అయితే, ఇలా ధరఖాస్తు చేసుకున్న రుణాలను బ్యాంకులు తొందరగా ఆమోదించాలంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి. అందుకే ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సిబిల్ స్కోర్ గురుంచి ముందుగా తెలుసుకోవాలి. సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతినే సిబిల్ స్కోర్ అంటారు. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు, మీ క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించిన తీరు, తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో ఎప్పుడైనా విఫలమయ్యారా? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ నిర్ణయిస్తారు. ప్రతి బ్యాంక్ రుణాలు ఇచ్చే ముందు మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తాయి. సిబిల్ స్కోరు మీ క్రెడిట్ చరిత్రను చూపిస్తుంది. మీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రుణదాత ఆమోదం తెలిపే శాతం పెరుగుతుంది. ఈ సిబిల్ స్కోర్ గతంలో మీరు తీసుకున్న రుణాల తిరిగి చెల్లించడంలో ఎంత బాధ్యతగా ఉన్నారు అని చూపిస్తుంది. సిబిల్ స్కోర్ లో మినిమం స్కోర్ 300 కాగా అత్యదిక స్కోర్ 900గా ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే మీకు రుణం పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ స్కోర్ వస్తే.. మీ దరఖాస్తు చేసుకున్న లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ దరఖాస్తు ఆమోదం పొందాలంటే మీ క్రెడిట్ స్కోరు మాత్రమే ప్రమాణం కాదని గుర్తుంచుకోండి. మీకు నెలానెలా వచ్చే ఆదాయం, వేతనం ఎంత? ఆదాయంలోంచి వ్యయం పోగా మిగిలిన దాంట్లో తిరిగి రుణం చెల్లించే పరిస్థితి ఉందా లేదా? మీరు ఉంటున్న నగరం, అప్పులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలన్నింటినీ బ్యాంకులు పరిశీలిస్తాయి.

* లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో బైకుల అమ్మకాలు మేలో ఢమాల్‌ అన్నాయి. ఒక్కసారిగా అమ్మకాలు సగానికి సగం పడిపోయాయి. కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని స్టేట్స్‌లో లాక్‌డౌన్‌ అమలు చేశారు. దీంతో టూ వీలర్‌ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ది ఫేడరేషన్‌ ఆఫ్‌ ఆటో మొబైల్ డీలర్‌ అసోసియేషన్స్‌ (ఫెడా) తాజా గణాంకాలు ఇదే విషయం తెలియజేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అమల్లోకి రాకముందు ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా టూ వీలర్స్‌ మార్కెట్‌ ఆశాజనకంగా ఉంది. 2021 ఏప్రిల్‌లో 6,67,841 యూనిట్లు అమ్ముడయ్యాయి. మేలో ఈ సంఖ్య 2,95,257కి పడిపోయింది. ప్రత్యేకించి స్కూటర్‌ అమ్మకాలు మరీ దారుణంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో అమ్ముడుపోయిన యూనిట్ల సంఖ్య 3,00,462 ఉండగా మే వచ్చే సరికి ఈ సంఖ్య 50,294కి పడిపోయింది. మొత్తంగా టూ వీలర్‌ అమ్మకాల్లో 56 శాతం క్షీణత నమోదు అవగా స్కూటర్‌ సెగ్మెంట్‌లో 83 శాతం క్షీణత నమోదైంది.

* కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో కోడిగుడ్లకు గిరాకీ విపరీతంగా పెరిగినట్లు ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు వెల్లడించారు. గత జనవరి-ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందనే ప్రచారంతో ఒక్కసారిగా గుడ్ల వినియోగాన్ని ప్రజలు తగ్గించారు. అయితే కొవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో, రోగ నిరోధకత పెంచుకునేందుకు మళ్లీ గుడ్ల వినియోగం పెంచారు. ఒకపక్క లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు, కార్మికుల కొరత వల్ల సరఫరా ఇబ్బందులున్న ప్రస్తుత సమయంలో గిరాకీ పుంజుకుంది. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయాలు పెరిగిపోవడంతో గుడ్ల రిటైల్‌ ధరలు ఆయా ప్రాంతాల ఆధారంగా రూ.6-7 వరకు పెరిగాయి. కొవిడ్‌-19 రోగులకు అధికంగా ప్రోటీన్లు లభించే ఆహారం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలో ప్రోటీన్లు అందేందుకు గుడ్లు సులభ మార్గమని నిపుణులు చెబుతున్నారు. ‘కొన్ని నెలలుగా గుడ్ల వినియోగం బాగా పెరిగింది. వీటిలో అత్యధికంగా 11 శాతం ప్రోటీన్‌ కంటెంట్‌ ఉంటుంద’ని పశు సంవర్థక, పౌల్ట్రీ, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ ఓపీ చౌధరి వెల్లడించారు. నెలవారీగా గుడ్ల వినియోగం పెరుగుదలను అంచనా వేయడం కష్టమని మరో అధికారి పేర్కొన్నారు. 2018-19లో ఒక వ్యక్తి సగటు వార్షిక వినియోగం 79 గుడ్లు కాగా, 2019-20కి అది 86 గుడ్లకు చేరిందని వివరించారు.

* వాహన విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ (సోనా కామ్‌స్టర్‌) తన పబ్లిక్‌ ఇష్యూకు ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.2,498 కోట్లు సమీకరించింది. ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ సోమవారం (రేపు) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇష్యూలో జారీ చేసే షేర్లకు రూ.285-291ను ధరల శ్రేణిగా కంపెనీ నిర్ణయించింది. ఇందులో గరిష్ఠ ధరైన రూ.291 చొప్పున 42 యాంకర్‌ ఇన్వెస్టర్లకు మొత్తం 8.6 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు బీఎస్‌ఈకి సోనాకామ్‌స్టర్‌ సమాచారం ఇచ్చింది. తద్వారా రూ.2,498 కోట్లు సమీకరించినట్లు పేర్కొంది. ప్రతిపాదిత ఇష్యూ పరిమాణమైన రూ.5,550 కోట్లలో ఈ విలువ 45 శాతం కావడం గమనార్హం. 42 యాంకర్‌ ఇన్వెస్టర్లలో 24 విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు, 11 దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, 5 జీవిత బీమా సంస్థలు, 2 ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లు ఉన్నాయి. కాగా, ఎస్‌బీఐ కార్డ్స్‌, పవర్‌గ్రిడ్‌ ఇన్విట్‌ తర్వాత యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి అత్యధికంగా నిధులు సమీకరించిన సంస్థ సోనా కామ్‌స్టర్‌నే. ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ.2,769 కోట్లు, పవర్‌గ్రిడ్‌ ఇన్విట్‌ రూ.3,480 కోట్లు సమీకరించాయి.