* కొవిడ్ టీకా తీసుకున్నాక తమలో అయిస్కాంత శక్తులు ఉద్భవిస్తున్నాయంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల దిల్లీ, నాసిక్‌కు చెందిన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఝార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన తాహిర్ అన్సారీ అనే మరో వ్యక్తి కూడా టీకా తీసుకున్నాక తన శరీరంలో అయిస్కాంత శక్తులు కనిపించినట్టు చెప్పాడు. ‘‘శనివారం నేను వ్యాక్సిన్ వేయించుకున్నా. నాసిక్‌లో ఓ వ్యక్తి అయిస్కాంత శక్తులు వచ్చినట్టు చెప్పిన వీడియో చూసి ఓసారి టెస్ట్ చేద్దామని నిర్ణయించుకున్నా. అయితే, నా శరీరంపై స్పూన్‌లు, ఫోర్క్‌లు, నాణేలు అతుక్కోవడం చూసి ఆశ్చర్యపోయా’’ అని అతడు చెప్పినట్టు ‘ఇండియా టుడే’ పేర్కొంది. దీనిపై సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అయన ఇంటికి చేరుకొని పరీక్షలు చేశారు. అనంతరం వైద్యుడు డాక్టర్ ఎస్‌కే వేద్ రాజన్ మాట్లాడుతూ.. తాహిర్ శరీరంలో అయిస్కాంత కేంద్రమేమీ లేదన్నారు. అయితే, ఆయన్ను 48గంటల పాటు ఇంటివద్దే ఉండాలని సూచించినట్టు తెలిపారు. తాహిర్ ఆరోగ్యాన్ని మానిటర్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించామని వివరించారు. ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన అరవింద్ సోనార్ (71) అనే వ్యక్తి తాను రెండో డోసు తీసుకున్నాక అయస్కాంత శక్తులు వచ్చాయంటూ చేసిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని, లోహ ఆధారిత పదార్థాలేమీ వాటిలో లేవని స్పష్టం చేసింది. వ్యాక్సిన్లు వేయించుకుంటే మ్యాగ్నటిక్ సూపర్ పవర్స్ వస్తున్నాయన్న సమాచారం పూర్తిగా నిరాధారమైందని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కొట్టిపారేసింది. మానవ శరీరంలో మ్యాగ్నటిక్ ప్రతిచర్యకు కొవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదని తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని స్పష్టంచేసింది. కరోనాపై పోరాటానికి చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది.
* దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉన్న కొవిన్ యాప్‌తో పాటు థర్డ్ పార్టీ డెవలపర్ల నుంచి వ్యాక్సిన్ స్లాట్‌ల బుకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం గత నెలలో అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తమ యాప్‌లో వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టినట్లు సోమవారం ప్రకటించింది. పేటీఎం వినియోగదారులు తమ సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలు తెలుసుకొనేందుకు, కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి సహాయపడుతుందని వారు వెల్లడించారు. వినియోగదారులు వ్యాక్సిన్ స్లాట్లను బుక్ చేసుకొని టీకా తీసుకునేందుకు ఈ కొత్త సేవలు సహకరిస్తాయని పేటీఎం ప్రతినిధులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న టీకా రకంతో పాటు దాని రుసుము వంటి ఇతర సమాచారం కూడా తమ యాప్‌లో అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ వంతు బాధ్యతగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామని వారు పేర్కొన్నారు. దీని ద్వారా టీకా పంపిణీ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. కొవిడ్-19 సహాయక చర్యల్లో భాగంగా పేటీఎం సంస్థ ఇప్పటికే అనేక ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళం ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తోంది.
* ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,756 నమూనాలను పరీక్షించగా..4,549 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,14,393 మంది వైరస్ బారినపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 59 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,999కి చేరింది. తాజాగా 10,114 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17,22,381 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,05,38,738 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, ప్రకాశంలో 8 మంది, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణ జిల్లాలో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ముగ్గురు, కడప, నెల్లూరులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
* గురి తప్పని అస్త్రంలా దేశదేశాల్నీ చుట్టేసిన మహమ్మారి కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా 17.65 కోట్లమందికి సోకి సుమారు 38 లక్షల 12వేల నిండుప్రాణాల్ని కబళించేసింది. ఇంతగా మృత్యుపాశాలు విసరుతూ రెచ్చిపోయిన వైరస్ మానవ ప్రేరేపితమేనన్న కథనాలు, వుహాన్ ప్రయోగశాలే దాని పురిటిగడ్డ అన్న విశ్లేషణలు కొన్నాళ్లుగా ప్రపంచాన్ని కలవరపరుస్తూనే ఉన్నాయి. విధ్వంసక వైరస్ మూలాల గుట్టుమట్లు రట్టు కావాల్సిందేనంటూ నిరుడు గళమెత్తిన ఆస్ట్రేలియా మీద చైనా ఒంటికాలిపై విరుచుకుపడింది. వాణిజ్యపరమైన ఆంక్షలకు తెగబడింది. బీజింగ్‌తో సుదీర్ఘ మంతనాల దరిమిలా అక్కడ పర్యటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బృందం, కరోనా మూలం వుహాన్ ప్రయోగశాల కాదని మొన్న ఫిబ్రవరిలో నీళ్లు నమలడం తెలిసిందే. బలవంతాన అలా చెప్పించారన్న వాదనల్ని బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తల ఇటీవలి అధ్యయన నివేదిక గట్టిగా బలపరచింది. వైరస్ జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు మార్చేశారని, తత్ఫలితంగానే కొవిడ్ కారక ‘సార్స్ – కొవ్ 2’ పుట్టుకొచ్చిందని పుణె శాస్త్రవేత్తల తాజా పరిశోధనా ధ్రువీకరిస్తోంది. చైనా ఎంతగా మసిపూసి మారేడు చేయజూసినా ప్రపంచాన్ని ఏమార్చలేదంటున్న బ్రిటన్ నిష్పాక్షికంగా లోతైన అధ్యయనం జరిగి తీరాలంటోంది. వైరస్‌లోని స్పైక్‌ప్రొటీన్‌పై ధనావేశం కలిగిన నాలుగు అమైనో ఆమ్లాలు మానవ శరీరంలోని రుణావేశ భాగాలకు బలంగా అతుక్కునేలా వుహాన్ శాస్త్రవేత్తల బృందం లక్షించిందన్న విశ్లేషణల్ని బ్రిటన్ దృఢంగా విశ్వసిస్తోంది. వైరస్ ఆనుపానులు, మూలాలను వెలికితీసే బాధ్యతను శ్వేత సౌధాధిపతి బైడెన్ గూఢచార విభాగానికి కట్టబెట్టారు. నిన్నటితో ముగిసిన జి-7 సదస్సూ కొవిడ్ మూలాల వెలికితీతకు డిమాండు చేసింది. అందరూ తనను బోనులో నిలబెడుతున్నా చైనా స్పందనలో తెంపరితనమే ప్రస్ఫుటమవుతోంది!