Politics

ఏపీ గవర్నర్‌కు హస్తిన పిలుపు-తాజావార్తలు

ఏపీ గవర్నర్‌కు హస్తిన పిలుపు-తాజావార్తలు

* చాలా కాలం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రఘురామకృష్ణంరాజుతో వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి చాలా రోజులు గడిచిపోయింది. అదీకాక కొద్ది రోజుల క్రితమే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ పిలుపు రావడంతో ఈ అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ వెళ్లనున్న గవర్నర్ ప్రధాని మోడీతో సహా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

* విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేసుకుని ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యవహారాలు చూసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2, 3 నెలల్లోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం కావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే పరిపాలన రాజధానిగా నగరానికి మెరుగులు దిద్దేలా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కసరత్తు చేస్తోంది. వివిధ పర్యటనల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి విమానాశ్రయం మీదుగా నగరంలోకి ప్రవేశించే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక రహదారిని కేటాయించాలని భావిస్తోంది. బోయపాలెం వద్ద ఒక విద్యా సంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకూ.. ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ మీదుగా వెళ్లేలా 35 కి.మీ మార్గాన్ని ఎంపిక చేసింది. ఈ మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించేలా ప్రణాళిక రచిస్తున్నారు. మరో పక్క ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో అంతర్గతంగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఇదివరకే జీవీఎంసీ పరిధిలో వివిధ రకాల పనులు చేసిన గుత్తేదారులకు రూ.350 కోట్ల మేర బకాయిలున్నాయి. వీటిని త్వరగా చెల్లించి మౌలికవసతుల పనులకు సహకరించాలని వారిని కోరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

* వైరస్‌ను వడకట్టడమే కాకుండా దాన్ని నిర్వీర్యం కూడా చేసే వినూత్న మాస్కును పుణెకు చెందిన ఒక అంకుర పరిశ్రమ అభివృద్ధి చేసింది. త్రీడీ ముద్రణ, ఔషధ పరిజ్ఞానాన్ని అనుసంధానించడం ద్వారా ఈ ఘనత సాధించింది. థింకర్‌ టెక్నాలజీస్‌ ఇండియా సంస్థ ఈ మాస్కును రూపొందించింది. దానికి యాంటీవైరల్‌ పూతను పూశారు. ఈ తరహా రసాయనాలను వైరుసైడ్స్‌ అని కూడా పిలుస్తుంటారు. సోడియం ఒలెఫిన్‌ సల్ఫోనేట్‌ ఆధారిత మిశ్రమంతో దీన్ని తయారుచేశారు. ఇందులోని పదార్థాలన్నీ సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటాయి. వీటిని సబ్బులు, సౌందర్య లేపనాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. తనను తాకిన వైరస్‌లను ఈ పూత నిర్వీర్యం చేస్తుంది. వైరస్‌ వెలుపలి పొరలను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తిని అడ్డుకుంటుంది. ఈ రసాయనం.. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను కూడా నిర్వీర్యం చేయగలదని పరీక్షల్లో రుజువైంది.

* కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో అప్పుల బాధ భరించలేక పోస్టల్‌ ఉద్యోగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక పోస్టుమాస్టర్‌ రఘుబాబు ఇటీవల పలు ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యారు. కుటుంబ అవసరాల కోసం పలువురి నుంచి తీసుకున్న అప్పు తీర్చేందుకు గడువు కోరాడు. వెంటనే చెల్లించాలని వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

* మాన్సాస్‌ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.పదవులు ముఖ్యం కాదని.. అభివృద్ధి చూడాలని చెప్పారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని వెల్లంపల్లి చెప్పారు. అన్యాక్రాంతమైన ట్రస్టు, దేవాలయ భూములను గుర్తిస్తున్నామన్నారు.

* ఆస్తుల రక్షణకే ఈటల రాజేందర్ భాజపాలో చేరినట్లు కనిపిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. కేసులకు భయపడే ఆయన చేరారన్నారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. ఈటల వామపక్ష సిద్ధాంతాలు ఏమయ్యాయని.. ఏం ఉద్ధరించడానికి భాజపాలో చేరారని ప్రశ్నించారు.

* రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని వేడుకున్నట్లు తెదేపా సీనియర్‌ నేత, మాన్సాస్‌ ట్రస్టు మాజీ ఛైర్మన్ అశోక్‌ గజపతిరాజు అన్నారు. మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా సంచైత నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.

* పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లే కన్పిస్తోంది. ఛోక్సీ ‘అప్పగింత’పై డొమినికా న్యాయస్థానం సోమవారం విచారణ జరపాల్సి ఉండగా.. అనారోగ్యంగా ఉందంటూ ఆయన అసలు కోర్టుకే రాలేదు. దీంతో విచారణ వాయిదా పడింది.