Business

భారీగా తగ్గిన బంగారం ధర-వాణిజ్యం

భారీగా తగ్గిన బంగారం ధర-వాణిజ్యం

* దేశంలోని 256 జిల్లాల్లో బుధవారం నుంచి బంగారు నగలపై హాల్‌మార్కింగ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు మినహా మిగిలిన 12 జిల్లాల్లో; తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ అమల్లోకి వచ్చినట్లు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) వెల్లడించింది. ఈ నేపథ్యంలో మీరు కొనుగోలు చేయబోయే బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ తప్పనిసరి. అయితే, హాల్‌మార్క్ గుర్తు అస‌లైన‌దా కాదా అని ప‌రిశీలించ‌డం కూడా చాలా ముఖ్యం. కొన్ని నగల దుకాణాలు త‌మ సొంతంగా హాల్‌మార్క్‌ను ముద్రించే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే బంగారు ఆభ‌ర‌ణాలు కొనుగోలు స‌మ‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి.

* బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త! గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధర గురువారం భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.861లు తగ్గడంతో రూ.46,863కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.47,742గా ముగిసింది. ప్రపంచ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ తగ్గుదల కనిపించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1709లు తగ్గడంతో 68,798గా ట్రేడ్‌ అవుతోంది.

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లు పెంచుతుందన్న సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. దేశీయ మార్కెట్లపైనా దాని ప్రభావం ఉండడంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 15,700 దిగువన ముగిసింది.

* కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 లక్షల కోట్లక మేరకు నష్టం వాటిల్లిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఆర్బీఐ) తమ నెలవారీ బులెటిన్‌ (జూన్‌-2021)లో పేర్కొంది. చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా వైరస్‌ వ్యాపించడంతో ఈ పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సెకండ్‌వేవ్‌ నుంచి కోలుకొనేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఆర్బీఐ విడుదల చేసిన ఈ బులెటిన్‌లో ఆర్థిక వ్యవస్థ స్థితి, దిగుబడులు వంటి అంశాలను తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే కరోనా సెకండ్‌ వేవ్‌లో కాంటాక్ట్‌లెస్‌ సేవలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

* వన్ ప్లస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ చివరకు ఒప్పోతో విలీనం కానున్నట్లు ప్రకటించింది. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ.. మరింత మందికి చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విలీనం తర్వాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ ప్రత్యేక బ్రాండ్లుగా స్వతంత్రంగా పనిచేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే సరసమైన స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని భారతదేశం, ఇతర మార్కెట్లలో లాంఛ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన చేసింది.