ఓ సూపర్ హిట్ గీతంలో తను నర్తించలేకపోయిందని ఫీలైంది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. అంతేకాదు అందులో ఆడిపాడిన వారిపై ఈర్ష్యగా ఉంది చెప్పుకొచ్చిందామె. అసలు విషయం ఏంటంటే.. 1993లో వచ్చిన ‘బాజిగర్’ చిత్రంలోని ‘ఏ కాలీ కాలీ’ పాట ఎంత ఆదరణ పొందిందో తెలిసిన విషయమే. షారుఖ్ ఖాన్, కాజోల్‌పై చిత్రీకరించిన ఈ గీతం సంగీత ప్రియుల్ని ఓలలాడించింది. తాజాగా ఇదే పాటకి ‘సూపర్ డ్యాన్సర్ ఛాప్టర్ 4’ (హిందీ) అనే రియాలిటీ షోలో నీర్జా, భావన అనే కంటెస్టెంట్లు డ్యాన్సు చేశారు. దాన్ని చూసి ఈ షోకి న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్న శిల్పాశెట్టి తన మనసులో మాట బయటపెట్టారు. హుషారైన ఈ పాటలో తను నటించాలనుకున్నానని, ఈ పాట తనకు ఇవ్వనందుకు ఇప్పటికీ ఈర్ష్యగా ఉంటుందని తెలిపారు. అనంతరం అదే స్టేజీపై గాయకుడు కుమార్ సానుతో కలిసి ఈ పాటకి డ్యాన్స్ చేశారు శిల్పా. ‘బాజిగర్’ చిత్రంతోనే నటిగా మారింది శిల్పాశెట్టి. షారుఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అబ్బాస్- మస్తాన్ ఈ సినిమాని తెరకెక్కించారు. అను మాలిక్ అందించిన సంగీతం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాలోని గీతాలు వినిపిస్తూనే ఉంటాయి.
పశ్చాత్తాపం
Related tags :