* ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఉదయం 11 గంటలకు మొదట సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను ప్రారంభించి… తర్వాత సిద్దిపేట పట్టణ శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు సీఎం. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారన్నారు మంత్రి హరీష్.
* యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో నిన్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం చెందిన అంబడిపూడి మరియమ్మ(44) అనే మహిళ మృతి చెందడంతో దీనిపై కొందరు నాయకులు ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వైఎస్ షర్మిల పోలీసులపై మండిపడ్డారు. ‘దొంగతనం అన్న అనుమానంతో అరెస్టు చేసిన మహిళను లాకప్ డెత్ చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. నిజనిజాలు నిగ్గుతేల్చకుండా చంపమని చెప్పిందా ఈ సర్కార్..? పోలీస్ స్టేషన్‌లో చంపేసి గుండెపోటు అంటూ నాటకాన్ని రక్తికటిస్తారా..? ఇదేనా మీరు చేసే విచారణ’ అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విచారణ నెపంతో అన్యాయంగా ఒక మహిళ ప్రాణాలు తీస్తారా..? మరియమ్మను పొట్టనపెట్టుకున్న అడ్డగూడూరు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
* తెలంగాణ రాష్ట్రంలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో ప్రారంభించాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే విద్యార్థులను స్కూళ్లకు పంపాలా, వద్దా అనేది తల్లిదండ్రుల నిర్ణయానికి కేబినెట్ వదిలేసింది. విద్యార్థులు తప్పనిసరిగా స్కూళ్లకు రావాలని యాజమాన్యాలు బలవంతపెట్టకూడదని కేబినెట్ ఆదేశించింది. పాఠశాలలకు రాని విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల్లో హాజరుకావచ్చని కేబినెట్ సూచించింది. విధివిధానాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.
* రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యాహ్నం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
* దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతిని ఏకం చేసే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. ఏఐసీసీ పగ్గాలు రాహుల్ గాంధీ చేపట్టాలని కోరారు. దళితుల్లో ఆత్మస్థైర్యం నింపిన ఘనత ఇందిరా గాంధీదేనని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుడు తూటుకూరి మల్లారెడ్డి మనస్థాపానికి సీఎం కేసీఆర్ తీసుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టే కారణమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. మల్లారెడ్డి చితి పేర్చుకుని సజీవదహనం చేసుకోవాడం బాధాకరమన్నారు. మల్లారెడ్డి చావుకు కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
* జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ప్రజలందరూ మరొక పోరాటానికి ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుణ మాట్లాడారు. ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ ప్రాంత ప్రజలు అవమానానికి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో ఇచ్చిన 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు అలంపూర్‌లో నేటికీ రూపుదాల్చకపోవడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు.
* వచ్చే నెల 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది. 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. 26న ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించనున్నారు.
* తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్న మరో 1,813 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,568 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే లక్ష 23వేల 5 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
* మధిర మున్సిపాలిటీలో అధికార పక్షం ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తుందని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ ఆరోపించారు. ఈరోజు 18వ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నారని, ఆ ప్రాంత ప్రజలు తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే రోడ్డు నిర్మించే ప్రాంతానికి వెళ్లగా సిమెంటు లేకుండానే ఇసుక కంకర కలిపి సిమెంట్ రోడ్డు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని మున్సిపల్ ఏఈ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే వర్క్ ఇన్స్పెక్టర్ పంపించి నాసిరకం గా నిర్మించే పనులను నిలిపివేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్మిస్తున్న సైడ్ డ్రైన్లు, సిమెంట్ రోడ్లు, పరిశీలిస్తామని నాసిరకంగా నిర్మిస్తున్న రహదారులపై కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. నాసిరకంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కు బిల్లులు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 18 వ డివిజన్ ఇంచార్జి రామిశెట్టి సత్యనారాయణ, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, షేక్ జాంహగీర్, జింకల కోటేశ్వరావు, చక్రి తదితరులు పాల్గొన్నారు
* స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిల్కా మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం తెలిపారు. దిగ్గజ క్రీడాకారుడి మరణం తన హృదయాన్ని దుఃఖంతో నింపేసిందన్నారు. మిల్కా కష్టాలు, బలమైన వ్యక్తిత్వం అనేక తరాలకు ఆదర్శం అని కొనియాడారు. దేశం అతి విశిష్ట క్రీడాకారుడిని కోల్పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోట్లాది మంది హృదయాల్లో మిల్కా ప్రత్యేక స్థానం పొందారని తెలిపారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ లో మిల్కా చెరగని ముద్ర వేశాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కొనియాడారు. గొప్ప క్రీడాకారుడిగా దేశం మిల్కాను స్మరిస్తుందని తెలిపారు.