WorldWonders

పులులు పారిపోతున్నాయి

పులులు పారిపోతున్నాయి

మనుషులు పనుల నిమిత్తం ఒక చోట నుంచి మరొక చోటకి వలస వెళ్లడం సహజం. కానీ, పులులు కూడా వలస బాట పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువయ్యాయి. వాటికి సరిపడా భూభాగం లేకపోవడమే దీనికి కారణమంటున్నారు వన్యప్రాణుల నిపుణులు. ఆడ పులులకు సాధారణంగా 20 చదరపు కిలోమీటర్ల భూభాగం, మగ పులులకు 100 చదరపు కిలోమీటర్ల వరకు అవసరం. అయితే, పులికి లభించే వనరులను బట్టి ఇది మారవచ్చు. వాటి భూభాగం ఏ మాత్రం తగ్గిందని అనిపించినా అవి వలస వెళుతుంటాయి. విదర్భలోని తిపేశ్వర్‌ అడవిలో టి3సి1పేరు ఉన్న రెండు సంవత్సరాల వయస్సు ఉన్న ఒక మగ పులి 2వేల కిలోమీటర్లు నడిచి వాకర్‌2గా పేరు తెచ్చుకుంది. తిపేశ్వర్‌ నుంచి మహారాష్ట్ర మీదగా ప్రయాణించి రంగాబాద్‌ జిల్లాలోని గౌతలా ఆటోరామ్‌ఘాట్‌ అడవిలోకి చేరినట్లు మార్చి 15న అక్కడి కెమెరాలో కనిపించింది. ఈ పులిని అనుసరిస్తూ వచ్చిన అధికారి ఈ ప్రాంత అధికారులను కలిశాడు. పులిచారలు ఆధారంగా అడవిలోకి కొత్తగా వచ్చింది టి3సి1 పులి అని గుర్తించారు. ఒక పులి పెద్దఎత్తున వేల కిలోమీటర్లు నడిచి గౌతలా అడవికి రావడం అక్కడి అధికారులను ఆశ్చర్యపరిచింది. ఈ అడివి 260 చదరపు కి.మీ. భూభాగం ఉంది. ఇప్పటికే కనీసం 25 చిరుతపులులు ఉన్నాయి. కానీ తిపేశ్వర్‌ అడవి 150 చదపు కిలోమీటర్లు ఉంది. అందుకే ఈ పులి ఇక్కడకు వచ్చిందంటున్నారు. 2019 జూన్‌లో మరొక పులి తిపేశ్వర్‌ నుంచి బుల్ధాన జ్ఞ్యాంగాగ అడవిలోకి చేరుకుంది. ఏడు నెలల్లో 3 వేల కిలోమీటర్లు నడిచి వాకర్‌ 1గా పేరు తెచ్చుకుంది. నెల క్రితం రాజస్థాన్‌లో రణతంబోర్‌ అడవిలో సంవత్సరం కాలంలో ఆరు పులులు వలస వెళ్లినట్లు ఫారెస్ట్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ చంద్రవర్మ తెలిపారు. ఈ పులులు చంబల్‌నది దాటి మధ్యప్రదేశ్‌ అడవుల్లో వెళ్లినట్లు వారు గుర్తించారు. రణతంబోర్‌ అటవీ 1,334 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ రిజర్వులో సుమారు 70 పులులు ఉన్నాయి. మహారాష్ట్ర అడవులకు ఆనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పులులకు ఆవాసంగా మారింది. ఇప్పటికే ఈ కవ్వాల్‌లో ఆరు పెద్ద పులులు ఉండగా తాజాగా మరో మూడు పులులు గత ఏడాది వలస వచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు. దేశంలో పులుల సంరక్షణ ప్రాజెక్ట్‌ చాలా విజయవంతంగా ఉందని అధికారులు చెబుతున్నా… తరుచూ పులులు ఇలా వలస పోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సంతృప్తికరమైన భూభాగం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.