Editorials

అమెరికాలో తలదాచుకుంటున్న చైనా గూఢచర్య విభాగాధిపతి?

అమెరికాలో తలదాచుకుంటున్న చైనా గూఢచర్య విభాగాధిపతి?

చైనా గూఢచారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక వ్యక్తి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై చైనా కూడా ఆచితూచీ వ్యవహరిస్తోంది. చైనా మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్రటరీ విభాగంలో వైస్‌ మినిస్టర్‌గా పనిచేస్తున్న డాంగ్‌ జింగ్‌వుయ్‌ అదృశ్యంపై డ్రాగన్‌ ఆందోళన చెందుతోంది. కాకపోతే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడంలేదు. నిజంగానే డాంగ్‌ అమెరికాకు పారిపోతే మాత్రం చైనా గూఢచర్య నెట్‌వర్క్‌కు చావుదెబ్బ తగిలినట్లే.

డాంగ్‌ జింగ్‌వుయ్‌ 2018 నుంచి చైనా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్స్‌ వ్యవహారాలకు అధిపతిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో తన కుమార్తె డాంగ్‌ యాంగ్‌తో కలిసి హాంకాంగ్‌ మీదుగా అమెరికాకు చేరుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బాహ్య ప్రపంచంలో కనిపించడంలేదు. దీంతో చైనా సోషల్‌ మీడియా వేదికలపై ఇది చర్చనీయాంశంమైంది. కానీ, చైనా అధికారిక మీడియా మాత్రం జూన్‌ 18న డాంగ్‌ ఒక సింపోజియంలో పాల్గొన్నట్లు పేర్కొంటోంది. అందులో కూడా చైనా వేగులు ప్రత్యర్థి శక్తులతో చేతులు కలపడంపై ఆయన హెచ్చరించారని పేర్కొంటున్నాయి.

అమెరికా వలస వచ్చిన చైనా మాజీ విదేశాంగశాఖ మంత్రి హాన్‌ లియాన్చావ్‌ జూన్‌ 16వ తేదీన డాంగ్‌ విషయాన్ని ట్వీట్‌ చేయడంతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి డాంగ్‌ అంశాన్ని మార్చిలో అలాస్కాలో జరిగిన అమెరికా-చైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నాడు. డాంగ్‌ను అప్పగించాలని అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోని బ్లింకన్‌, ఎన్‌ఎస్‌ఏ జాక్‌ సలైవాన్‌ వద్ద చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి కోరినట్లు పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చిందని వెల్లడించాడు. హాన్‌ కూడా చైనా నుంచి పారిపోయి వచ్చి వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. ఆయన ‘సిటిజన్‌ పవర్‌ ఇనీషేటీవ్‌ చైనా’ పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తున్నాడు. 1989లో తియనాన్మెన్‌ స్క్వేర్‌ ఘటన తర్వాత అమెరికాకు వచ్చేశాడు.

స్పై టాక్‌ న్యూస్‌ లెటర్‌ కూడా డాంగ్‌ అమెరికాలో దాక్కోవడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఒక వేళ అది నిజమైతే చైనా చరిత్రలోనే అతిపెద్ద వెన్నుపోటుగా పేర్కొంది. స్పైటాక్‌ సంస్థ అమెరికా ఇంటెలిజెన్స్‌, విదేశాంగ విధానంపై కీలక సమాచారం ఇస్తుంటుంది.

అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మాజీ సీఐఏ నిపుణుడు నికోలస్‌ ఎఫ్టిమిడ్‌ స్పందిస్తూ..‘దీనిని ధ్రువీకరించుకోవడం దాదాపు అసాధ్యం’ అని పేర్కొన్నాడు. మరికొన్ని అమెరికా పత్రికలు డాంగ్‌ చైనా నుంచి పారిపోయినట్లు కథనాలను ప్రచురించాయి. ప్రస్తుతం అతను అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ) కస్టడీలో ఉన్నట్లు పేర్కొన్నాయి.

డాంగ్‌ కనుక అమెరికా వద్ద ఉంటే మాత్రం చైనాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే. అతనికి అక్కడి ప్రత్యేక ఆయుధ వ్యవస్థలు, వుహాన్‌ ల్యాబ్‌లో చైనా సైన్యం కార్యకలాపాలు, అమెరికాలో ఉన్న చైనా వేగుల సమాచారం మొత్తం లీకైయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ డేటా డీఐఏ చేతికి అందినట్లు రెడ్‌స్టేట్‌ పత్రిక కథనంలో పేర్కొంది.

మరోపక్క చైనా అధికారికంగా దీనిపై స్పందించలేదు. కానీ ఆ దేశ పత్రికల్లో మాత్రం జూన్‌ 18వ తేదీన డాంగ్‌ ఒక కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సింపోజియంలో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి. దానిలో ఆయన మాట్లాడుతూ నమ్మకద్రోహుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్టు పేర్కొన్నాయి.