* దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచుతూ దేశీయ ఇంధన విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.36కు.. డీజిల్ రూ.95.44కు చేరుకుంది. ఇక రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.108.37కి చేరడం గమనార్హం. ఇప్పటికే మొత్తం 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైకి ఎగబాకిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్, కర్ణాటక ఉన్నాయి.
* భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. జూన్ 11తో ముగిసిన వారంలో వరుసగా రెండవవారమూ 600 బిలియన్ డాలర్ల ఎగువన సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదుచేసుకున్నాయి. వారంవారీగా నిల్వలు 3.074 బిలియన్ డాలర్లు పెరిగి 608.081 బిలియన్ డాలర్లకు చేరాయి (డాలర్ మారకంలో రూపాయి ప్రస్తుత విలువ ప్రకారం దాదాపు రూ.45 లక్షల కోట్లు) . శుక్రవారం ఆర్‌బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది.
* దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ పెంపు జూలై నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇలా వేతనాలు పెంచడం ఇది రెండోసారి. వలసలను తగ్గించడానికి, నైపుణ్యం కలిగిన సిబ్బందిని తిరిగి రప్పించడానికి సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది తొలి నెల జనవరిలోనే సంస్థ జీతాలు పెంచిన విషయం తెలిసిందే. శనివారం కంపెనీ 40వ వార్షికోత్సవ సాధారణ సమావేశంలో కంపెనీ సీవోవో ప్రవీణ్ రావు మాట్లాడుతూ..ఐటీ సేవలకు డిమాండ్ నెలకొనడంతో భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు, గతేడాదితో పోలిస్తే వలసలు అధికంగా ఉండటం కూడా మరో కారణమని వెల్లడించారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 20 వేల మంది గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే విప్రో 80 శాతం మంది సిబ్బంది వేతనాలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు వచ్చే సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. అలాగే టీసీఎస్ కూడా ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చేలా వేతనాలు పెంచిన విషయం విధితమే. మరోవైపు, కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ మాట్లాడుతూ… అతిపెద్ద కంపెనీలను కొనుగోలు చేసే ఉద్దేశం సంస్థకు లేదని, డిజిటల్ విభాగంలో ఉన్న చిన్న సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
* ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ నికరలాభం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.4,649 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ.1,630 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 31,330 కోట్ల నుంచి రూ.31,687 కోట్లకు పెరిగినట్లు ఎక్సేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. శనివారం సమావేశమైన ఎన్టీపీసీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.3.15 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది.