కంప్యూటర్‌పై డేటా టైప్ చేయడం ఆయన వృత్తి! అదే టైపింగ్‌తో విన్యాసాలు చేసి, రికార్డులు సృష్టించడం ఆయన ప్రవృత్తి!! కఠోర సాధనతో దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ వినోద్ కుమార్ చౌధురి ఎన్నో విజయాలు సాధించారు. టైపింగ్‌లో ఏకంగా 9 గిన్నిస్ రికార్డులు సృషించారు. ముక్కుతో, మౌత్ స్టిక్‌తో, కళ్లకు గంతలు కట్టుకొని.. ఇలా రకరకాలుగా టైప్ చేసి, ప్రపంచ రికార్డుల మోత మోగించారు. ‘‘వేగమంటే నాకు ఆసక్తి. చిన్నతనంలో క్రీడల పట్ల మక్కువ ప్రదర్శించేవాడిని. పెద్దయ్యాక ఆరోగ్య సమస్యల వల్ల క్రీడల విషయంలో ముందడుగు వేయలేకపోయా. దీంతో వేగం విషయంలో నాకున్న ఆసక్తిని కంప్యూటర్ రంగంవైపు మళ్లించా. 2014లో నా తొలి గిన్నిస్ రికార్డు సృష్టించా. ముక్కుతో 46.30 సెకన్లలో 103 క్యారెక్టర్లను టైప్ చేసి దీన్ని సాధించా. మరిన్ని రికార్డుల కోసం కసరత్తు మొదలుపెట్టా. 2016లో మరో రెండు రికార్డులు సాధించా. కళ్లకు గంతలు కట్టుకొని 6.71 సెకన్లలో ఇంగ్లిష్ వర్ణమాలలోని అన్ని అక్షరాలను టైప్ చేశా. 6.09 సెకన్లలో వేగంగా టైప్ చేయడం ద్వారా మరో రికార్డు సృష్టించా. 2017లో నోట్లో ఒక కర్ర పెట్టుకొని ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలను 18.65 సెకన్లలో టైప్ చేసి, మరో ‘గిన్నిస్’ సాధించా. ఇదే విన్యాసాన్ని 17.69 సెకన్లలో పూర్తి చేయడం ద్వారా 2018లో నా పూర్వ రికార్డును బద్దలు కొట్టా. 2019లో 17.01 సెకన్లతో ఆ రికార్డునూ తిరగరాశా. ఒకే వేలుతో 29.53 సెకన్లలో అన్ని అక్షరాలను టైప్ చేసి గిన్నిస్‌లో మరోసారి చోటు సాధించా. గత ఏడాది ఒక టెన్నిస్ బంతిని నిమిషంలో 205 సార్లు తాకడం ద్వారా రికార్డు సృష్టించా’’ అని తెలిపారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేరిట 19 గిన్నిస్ రికార్డులు ఉన్నాయని, వాటిని అధిగమించాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు.
సాధారణ టైపిస్టు..సచిన్‌ను దాటాలని కోరిక
Related tags :