NRI-NRT

ఫ్లోరిడాలో నాట్స్ కాన్సులర్ సేవలు

ఫ్లోరిడాలో నాట్స్ కాన్సులర్ సేవలు

అమెరికాలో తెలుగు వారిని ఏకం చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇండియన్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను నిర్వహించింది. టెంపాబే నాట్స్ విభాగంతో పాటు స్థానిక భారతీయ సంఘాలు ఈ క్యాంప్ నిర్వహణలో కీలక పాత్ర పోషించాయి. ప్లోరిడాలోని హిందూ ఆలయం సహకారంతో, నాట్స్ హిందూ ఆలయంలోనే ఈ సర్వీసెస్ క్యాంప్ నిర్వహించింది.400 మందికి పైగా భారతీయులు ఈ కాన్సులర్ సేవలను ఈ వేదికగా ద్వారా పొందారు. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు, OCI దరఖాస్తు, పునరుద్ధరణలు, పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికేషన్, ధృవీకరణ వంటి వివిధ సేవలను అందుకున్నారు. ఈ క్యాంప్‌లో 4వేలకు పైగా పత్రాల పరిశీలన, ధ్రువీకరణ జరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓ క్రమపద్ధతిలో నాట్స్ వారందరికి సేవలు అందించడంలో చేసిన కృషిని భారత కాన్సులేట్ బృందం ప్రత్యేకంగా అభినందించింది. టెంపాబే లో ప్రవాస భారతీయులకు కాన్సులర్ సేవలను అందించడమే లక్ష్యంగా నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రవాస భారతీయులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇది తమకు ఎంతగానో ఉపకరించే కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాట్స్‌ను ప్రత్యేకంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షులు(ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది కీలక పాత్ర పోషించారు. ఈ సేవలను అందించడంలో ప్రవాస భారతీయులకు సహకరించిన నోటరీ సర్వీస్ ప్రోవెడర్లు జగదీష్ తోటం, పరాగ్ సాథే, హేమ కుమార్‌లకు నాట్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇండియన్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను దిగ్విజయం చేసేందుకు నాట్స్ ముందు నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహారించింది. ఉదయం యోగా శిబిరంతో ఈ క్యాంప్ ప్రారంభించింది. దాదాపు 30 మంది సభ్యులు ఈ యోగా శిబిరంలో పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా నాట్స్ జాగ్రత్తలు తీసుకుంది. మాస్క్‌లు, టెంపరేచర్ చెకింగ్ వంటి సీడీసీ మార్గదర్శకాలను అమలు చేసింది.. నిర్వాహకులకు కావాల్సిన ఆహార ఏర్పాట్లు చేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ, సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టెంపా బే విభాగం జాయింట్ కోఆర్డినేటర్ సురేష్ బొజ్జాతో పాటు నాట్స్ సభ్యులు విజయ నాయుడు కట్టా, అనిల్ అరిమంద, జగదీష్ తోటం, సుమంత్ రామినేని, అచ్చిరెడ్డి శ్రీనివాస్, నవీన్ మేడికొండ, హేమ కుమార్, సాయి వర్మ, పరాగ్ సాతే, రమేష్ కొల్లి తదితరులు ఈ క్యాంప్ విజయవంతం చేయడానికి తమ వంతు సహయ సహకారాలు అందించారు. ఈ సర్వీస్ క్యాంప్‌కు మద్దతు ఇచ్చిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళి మేడిచెర్లకు నాట్స్ టెంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.