* మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా వెలువడనప్పటికీ ఇప్పటికే సందడి నెలకొంది. ‘మా’ అధ్యక్షుడి రేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు ఉన్నారు. వీరిద్దరికీ కూడా సినీ రంగంలో పరిచయాలు, సాన్నిహిత్యాలు ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు తన కుమారుడు మంచు విష్ణు కోసం మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ కృష్ణను ఈరోజు ఆయన కలిశారు. కృష్ణ నివాసానికి విష్ణుతో కలిసి మోహన్ బాబు వెళ్లారు. విష్ణుకు మద్దతును ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరినట్టు సమాచారం. కృష్ణతో కలిసి మోహన్ బాబు, విష్ణు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, వీరి సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు.
‘మా’ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెగా కుటుంబం మద్దతిచ్చే వారు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిరంజీవితో మోహన్ బాబుకు మంచి స్నేహం ఉంది. దీంతో, విష్ణును చిరంజీవి సపోర్ట్ చేసే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. బాలకృష్ణతో కూడా మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉంది. మరోవైపు చిరంజీవితో ప్రకాశ్ రాజ్ కు కూడా సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి మద్దతు తనకు పలుకుతారనే ఆశాభావంలో ఆయన కూడా ఉన్నారు.
* బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 21వ వార్షికోత్సవంలో ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆస్పత్రి 21 ఏళ్లు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
* ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రెండ్రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా ఏపీ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన న్యాయస్థానం.. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?లేదా స్పష్టంగా చెప్పాలని ఏపీని ఆదేశించింది. 11వ తరగతి పరీక్షలు సెప్టెంబరులో నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
* ప్రపంచమంతా ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఉత్తరకొరియా దేశంలో ఆ వైరస్ ఆనవాలే లేదట! ఇదే విషయాన్ని ఆ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా వెల్లడించింది. జూన్ 10 నాటికి తమ దేశంలో 30వేలమంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షించినట్లు సంస్థకు నివేదించింది. అయితే ఆ నిర్ధారణ పరీక్షల్లో ఒక్కరికి కూడా కరోనా సోకినట్లు వెల్లడికాలేదని తెలిపింది.
* ఓవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టిపెడుతుండగా మిజోరం రాష్ట్రంలో ఓ మంత్రి ఆసక్తికర ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న తల్లిదండ్రులకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించారు. మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రొమావియా ఫాదర్స్ డే సందర్భంగా ఈ ప్రకటన చేశారు. తన నియోజకవర్గం ఐజ్వాల్ తూర్పు-2 పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లీ లేదా తండ్రికి రూ. లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తానని వెల్లడించారు. నగదు బహుమతితో పాటు ట్రోఫీ కూడా అందజేస్తానని తెలిపారు. అయితే అత్యధిక సంతానం అంటే ఎంతమంది పిల్లలు అనేది మాత్రం మంత్రి స్పష్టంగా చెప్పలేదు.
* పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసమర్థ, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వనందున నిరుద్యోగ యువత భవితవ్యం ప్రశ్నార్థకమైందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండర్ విడుదల చేయటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. గ్రూప్-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయని.. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు. ఏటా రూ.లక్షలు ఖర్చుపెట్టి వివిధ రకాల శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి కల్పించే సమర్థత ఈ ప్రభుత్వానికి లేకపోవటంతో యువజన, విద్యార్థి సంఘాలు.. జగన్ వైఫల్యాలను నిలదీస్తున్నాయన్నారు.
* కరోనా వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా దేశంలో టీకా పంపిణీ వేగం పుంజుకుంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 88.09లక్షల డోసులు పంపిణీ చేశారు. 36.32% వ్యాక్సినేషన్ పట్టణ ప్రాంతాల్లో జరగ్గా.. 63.68% వ్యాక్సినేషన్ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 16న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో డోసుల పంపిణీ జరగలేదు. ఏప్రిల్ 1న మాత్రమే 48లక్షల మందికి టీకా వేశారు. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టీకా అందించేలా ఇటీవల సవరించిన మార్గదర్శకాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చిన తొలిరోజే ఇంత భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ జరిగింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా వ్యాక్సిన్లు పంపిణీ చేసిన తొలి 10 రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీ, బిహార్, హరియాణా, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, అసోం ఉన్నాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 29.16 కోట్ల డోసులు పంపిణీ జరిగింది. వీటిలో 23.92 కోట్ల మందికి ఒక డోసు అందించగా.. 5.24కోట్ల మందికి రెండో డోసు కూడా పూర్తి చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
* తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,24,907 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,175 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,15,574కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,586కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,771 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 5,95,348కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,640 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
* గుట్టుచప్పుడు కాకుండా కూకట్‌పల్లి, నిజాంపేట్ కేంద్రాలుగా పాకిస్థాన్‌లో జరుగుతున్న సూపర్ లీగ్ మ్యాచ్‌లకు భారీగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలను సైబరాబాద్ మాదాపూర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. బండారీ లేఅవుట్‌లోని పావని రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఈ ముఠా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోమన్న, అతని అనుచరులు సత్య పవన్‌కుమార్, సతీష్‌రాజు మరో ముగ్గురు కలిసి ఈ తతంగం నడుపుతున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.22.50 లక్షలు, 33 చరవాణులు, బెట్టింగ్ బోర్డు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాల్లో జరిగే మ్యాచ్‌లకు సైతం వీరు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించామని సీపీ వెల్లడించారు.
* పౌరసత్వ వివాదంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు చెన్నమనేని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన కౌంటర్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాలు గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని.. తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు విచారణను న్యాయస్థానం రెండు వారాలు వాయిదా వేసింది.
* లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు వదిలిపెట్టనున్నారు. లాక్‌డౌన్ సమయంలో జప్తు చేసిన వాహనాలను పూచికత్తు తీసుకొని విడుదల చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్లతో పాటు, జిల్లా ఎస్పీలకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.