* పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలకు చెందిన రూ.9,371 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేసింది. ఈ ముగ్గురి వల్ల బ్యాంకులకు వాటిల్లిన నష్టాల రికవరీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఈ ముగ్గురు వ్యాపారవేత్తలు తమ సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేశారని విచారణలో తేలినట్లు ఈడీ స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులకు మొత్తం రూ.22,585.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఈడీ జరిపిన విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలను పరిశీలించగా.. విదేశాల్లోనూ వీరు ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని వెల్లడించింది. అలాగే డొల్ల కంపెనీల పేరిట బ్యాంకుల నుంచి నిధులను సమీకరించారని పేర్కొంది. ఈ అంశాలపై మనీలాండరింగ్ చట్టం కింద విచారణ పూర్తయిన తర్వాత కేసులు నమోదు చేసినట్లు తెలిపింది.విచారణ ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టామని ఈడీ తెలిపింది. వీరు ముగ్గురి వల్ల వాటిల్లిన మొత్తం నష్టం రూ.22,585.83 కోట్లలో 84.45 శాతం అంటే రూ.18,170.02 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో రూ.969 కోట్లు విలువ చేసే విదేశీ ఆస్తులు కూడా ఉన్నట్లు తెలిపింది.
* కొవిడ్-19 కేసులు అధికంగా నమోదు కావడానికి తోడు బాధితులు ఎంతోమంది ఆసుపత్రుల పాలయ్యారు. మూడోదశ ప్రబలుతుందనే ఆందోళనలూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయంలో 15-17శాతం వృద్ధి కనిపించేందుకు ఇవన్నీ కారణం కావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కొవిడ్ రెండోదశ ఉద్ధృతితో బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో, ఆసుపత్రులకు ఆదాయాలూ బాగా పెరిగాయని తెలిపింది. 2020-21లో ఆర్జించిన మొత్తంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసుపత్రుల ఆదాయాలు 15-17% వరకు అధికంగా ఉండవచ్చని వెల్లడించింది. దీనివల్ల నిర్వహణ లాభాలు 100-200 బేసిస్ పాయింట్లు పెరిగి, 13-14శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.కొవిడ్-19 రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ నిష్పత్తి 75శాతానికి మించే ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది రెట్టింపు అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా అన్నారు. కొన్ని శస్త్రచికిత్సల కోసం వచ్చిన వారి సంఖ్య తగ్గినప్పటికీ.. కొవిడ్ బాధితులు అధికంగా ఉండటంతో ఆసుపత్రుల్లో చేరికలు తగ్గలేదని వివరించారు. జులై-సెప్టెంబరులో కరోనా కేసులు తగ్గినప్పటికీ ఇతర చికిత్సల కోసం వచ్చేవారితో పడకలు నిండుతాయని క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం ఆక్యుపెన్సీ ఉండగా.. ఈసారి ఇది 65-70శాతానికి తగ్గకుండా ఉండే అవకాశం ఉందని గుప్తా పేర్కొన్నారు. ఆదాయం, లాభాల్లో వృద్ధి నమోదు కావడం వల్ల విస్తరణకు ఆసుపత్రులు ప్రణాళికలు వేసే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. ఇందులో ఇతర ఆసుపత్రుల స్వాధీనం, పడకల సంఖ్య పెంచడం, ఇతర మౌలిక వసతుల కల్పన లాంటి వాటికి ప్రాధాన్యం ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రాజేశ్వరి కార్తిగేయన్ పేర్కొన్నారు.
* గత ఏడాది మార్చిలో సుమారు, రూ. 34,000 కోట్ల కంటే అధికంగా పెట్టుబడులు ఉపసంహరించుకోగా, ఈ ఏడాది తిరిగి అంతే వేగంగా ఈ ఫండ్లలోకి పెట్టుబడులు పెరిగాయి. మే 2021 లో మొత్తం రూ.4,521 కోట్ల పెట్టుబడులు రావడంతో మొత్తం జనవరి నుంచి ఇప్పటివరకు రూ.23,177 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి.చాలా మంది పన్ను ఆదా చేయడంతో పాటు తాత్కాలిక పెట్టుబడులకు ఆర్బిట్రేజ్ ఫండ్లను ఎంచుకుంటారు. ముఖ్యంగా కార్పొరేట్‌లు, అధిక నికర-విలువైన పెట్టుబడిదారులలో ప్రాచుర్యం పొందిన ఈ నిధులు సాధారణంగా స్టాక్‌లను కలిగి ఉండటం, ఫ్యూచర్‌లను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. స్ప్రెడ్ అని పిలువబడే రెండింటి మధ్య అంతరం ఫండ్‌కు దాని రాబడిని ఇస్తుంది.అస్థిర మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కొంత రిస్క్‌తో కూడుకున్నదే అయినప్పటికీ, ఆర్బిట్రేజ్ ఫండ్లు అస్థిర మార్కెట్లో బాగా పనిచేస్తాయి, లాభదాయకమైన రాబడిని అందిస్తాయి. ఈ నిధులు మార్కెట్ అసమర్థతలను ఉపయోగించుకొని పెట్టుబడిదారులకు లాభాలను ఆర్జిస్తాయి.ఆర్బిట్రేజ్ ఫండ్లు సాంప్రదాయక ఈక్విటీ-ఆధారిత ఉత్పత్తులు, ఇందులో ఈక్విటీ భాగం పూర్తిగా హెడ్జ్ చేయబడుతుంది, మిగిలిన భాగం ప్రధానంగా తక్కువ-మెచ్యూరిటీలతో కలిగిన మంచి డెట్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంది.ఈ ఫండ్లు కనీసం 65 శాతం స్టాక్స్‌లో, కొంత భాగం (20-30 శాతం) డెట్ ఫండ్లలో పెట్టుబడి పెడతాయి. ఇది మంచి రాబడికి సహాయపడుతుంది. దీని అర్థం ఇందులో రిస్క్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది.కానీ, గత సంవత్సరం పెట్టుబడుదారులు పెద్దమొత్తంలో తక్కువ ధరలకు అమ్మడంతో అప్పుడు ఈ ఫండ్లలో కూడా ప్రతికూలత ఏర్పడింది. అయితే గత మార్చి నుంచి, ఈక్విటీ ఇన్వెస్టర్ సెంటిమెంట్‌లో గణనీయమైన మెరుగుదల కనబడుతోంది. చాలా కీలక సూచికలు కొత్త గరిష్టాలను సాధించాయి. దీనికి అనుగుణంగా, స్టాక్ ఫ్యూచర్లపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది, ఇది మంచి అవకాశాలకు దారితీస్తుంది. దీంతో ఈ ఫండ్లు రిస్క్-సర్దుబాటు చేసిన రాబడిని అందించాయి.
* పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సుస్థిరం చేయడం కోసం వారి చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పొదుపు చేయడం ప్రారంభిస్తారు. ఇందుకోసం ఎంచుకునే పెట్టుబడి మార్గాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (ఫ్ఫ్F) ఖాతా ఒకటి. చాలా మంది తల్లిదండ్రులు ఖాతానైతే ప్రారంభిస్తున్నారు. కానీ కాలం గడిచే కొద్ది పెట్టుబడులు తగ్గిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకు పూర్తిగా నిలిపేస్తున్నారు. పిల్లల కోసం పీపీఎఫ్ ఖాతాను తెరవడం ఒక అద్భుతమైన ఆలోచన. అయితే మీ పిల్లలకు పూర్తి ప్రయోజనాలు అందాలంటే.. పెట్టుబడులు స్థిరంగా ఉండేలా చూసుకోవడం, ఖాతాను దీర్ఘకాలం పాటు పూర్తిస్థాయిలో నిర్వహించడమూ ముఖ్యమే.