Sports

WTC-2021: ఇండియా ఓడిపోయింది

WTC-2021: ఇండియా ఓడిపోయింది

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. టీమ్‌ఇండియాను ఓడించి తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 45.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (52; 89 బంతుల్లో 8×4), రాస్‌టేలర్‌ (47; 100 బంతుల్లో 6×4) బాధ్యతగా ఆడి కివీస్‌కు అపురూప విజయం అందించారు. అంతకుముందు రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(9; 41 బంతుల్లో), డెవాన్‌ కాన్వే(19; 47 బంతుల్లో 4×4)ను ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. దాంతో ఆ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం దక్కినా టీమ్‌ఇండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఓటమిపాలై ఐసీసీ ట్రోఫీల్లో మరోసారి భంగపాటుకు గురైంది.

కాగా, టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌(41; 88 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ పేసర్లు టిమ్‌సౌథీ 4/48, బౌల్ట్‌ 3/39 రాణించడంతో భారతబ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 32 పరుగులు కలుపుకొని న్యూజిలాండ్‌ అంతిమ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు 64/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆరోరోజు రిజర్వ్‌డే ఆట కొనసాగించిన కెప్టెన్‌ విరాట్‌ (13; 29 బంతుల్లో), చెతేశ్వర్‌ పుజారా (15; 80 బంతుల్లో 2×4) నిరాశపరిచారు. ఆట ప్రారంభమైన అరగంటకే ఒక్క పరుగు తేడాతో ఇద్దరూ పెవిలియన్‌ చేరారు. జేమీసన్‌ వరుస ఓవర్లలో వీరిని ఔట్‌చేశాడు.

ఆ తర్వాత రహానె (15; 40 బంతుల్లో 1×4) సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కాసేపు వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా చివరికి బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లెగ్‌సైడ్‌ వెళ్లే బంతిని ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆపై పంత్‌, జడేజా(16; 49 బంతుల్లో 2×4) జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును మెల్లిగా ముందుకు తీసుకెళ్లారు. వారిద్దరూ ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తొలుత జడ్డూ వాగ్నర్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా కాసేపటికే పంత్.. బౌల్ట్‌ బౌలింగ్‌లో నికోల్స్‌ చేతికి చిక్కాడు. అప్పటికి టీమ్‌ఇండియా స్కోర్‌ 156/7గా నమోదైంది. ఇక టెయిలెండర్లు అశ్విన్‌(7), షమి(13), బుమ్రా(0) కూడా పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 170 పరుగులకే పరిమితమైంది.