Agriculture

నేడు ఏరువాక పున్నమి

నేడు ఏరువాక పున్నమి

రైతు లేనిదే పూటగడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటుఇటు అయినా జేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడకమానదు. భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం.అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగను రైతన్నలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. ఏరువాక రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బండలు (బరువైన రాళ్ళూ) కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు. ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్ళలో పనిచేసే జీతగాళ్ళ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది.ఈ ఏరువాక పండుగ అతి ప్రాచీనమైంది. పూర్వం శ్రీకృష్ణదేవరాయ సార్వభౌముడు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతు సోదరులను ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ.. ఒక బంగారు రంగు నాగలిని కర్షకులకు అందించినట్లు చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు ప్రతీ సంవత్సరం కనిపించే ఈ సంప్రదాయ పండుగ ఇప్పుడు మెల్లగా కనుమరుగవుతోంది.ఏరువాక పౌర్ణమి రోజు రైతులు వ్యవసాయ పనిముట్లను అన్నిటినీ కడిగి శుభ్రం చేసి పసుపు -కుంకుమ అద్ది పూజిస్తారు. పశువులను అలంకరిస్తారు. రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులను ప్రారంభించే విధంగా ఏరువాకను వర్ణిస్తారు. జేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు దేశమంతటా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు.