మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుడు, సినీనటుడు నాగబాబు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. ప్రకాశ్ రాజ్ చాలా మంచి వ్యక్తని, మసకబారిన మా అసోసియేషన్ ప్రతిష్ఠ మళ్లీ పెరగాలని, చిరంజీవి మద్దతు తమకు ఉందని చెప్పారు. ‘ప్రకాశ్ రాజ్ కు ప్రతి భాషతో టచ్ ఉంది. ఎవరితోనైనా సరే వారి భాషలో మాట్లాడగలిగే సత్తా ఉన్న వ్యక్తి. ఎవరితో అయినా సరే ఏ పని అయినా సరే చేయించుకోగలిగే వ్యక్తి. అంతేకాదు, ప్రకాశ్ రాజ్ నాలుగైదు ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు’ అని నాగబాబు తెలిపారు. ‘మూడు-నాలుగు గ్రామాలు దత్తత తీసుకుని సేవలు అందిస్తున్నారు. చాలా మందికి ఇళ్లు కట్టించారు. చాలా మందికి సాయం చేశారు. ఇటువంటి వ్యక్తి మా లో ఉంటే ప్రతి ఒక్కరూ ఆయనను సంప్రదించొచ్చు. మా అసోసియేషన్ మాది అనే భావన కలుగుతుంది. ఇందాక ప్రకాశ్ రాజ్ కూడా ఇది ప్రస్తావించారు’ అని నాగబాబు చెప్పారు. ‘లోకల్, నాన్ లోకల్ అంటూ వాదిస్తున్నారు. అలా వాదించడం అర్థరహితం. ఎందుకంటే మా అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి మా అధ్యక్ష పదవి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప నటుడు తనను బాలీవుడ్ నటుడు అని అనకూడదని, భారతీయ నటుడు అనాలని అన్నారు. ప్రకాశ్ రాజ్ కూడా ఎక్కడ పుట్టాడు.. ఎక్కడ పెరిగాడు అన్న విషయం అనవసరం’ అన్నారు నాగబాబు. ‘లోకల్ కి, నాన్ లోకల్ కి ప్రామాణికం ఏమిటి? అమెరికాలోనే ఇటువంటి ఫీలింగులు లేవు. ఇలాంటి ఫీలింగులే ఉంటే అమెరికాలో కమలా హ్యారీస్ ఉపాధ్యక్షురాలు అయ్యేవారా? అన్నయ్య ఆశీర్వాదాలు కూడా మనకు ఉన్నాయి. దీనికి సంతోషిస్తున్నాం. అన్నయ్యను ప్రకాశ్ రాజ్ గారు అడిగినప్పుడు .. ‘మా’లో పోటీ చేయాలని అన్నయ్య చెప్పాడు’ అని నాగబాబు చెప్పారు. ‘అయితే, తాను నేరుగా ఇన్వాల్వ్ కానని చెప్పారు. కానీ, మా అసోసియేషన్ మంచి పనులు చేస్తే మద్దతుగా ఉంటానని చెప్పారు. ప్రకాశ్ రాజ్ చాలా సమర్థతగల వ్యక్తి. కొన్నేళ్లుగా మా అసోసియేషన్ ప్రతిష్ఠ మసకబారింది. ఇకపై అలా ఉండకూడదు” అని నాగబాబు వ్యాఖ్యానించారు.
#########
*సెప్టెంబర్‌లో జరగాల్సిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం ఈ పోటీలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణుతో పాటు జీవితా రాజశేఖర్, హేమ కూడా నిలబడుతున్నట్టు ప్రకటించడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాశ్ రాజ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తాను పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఏడాది నుంచి ప్యానల్ ఏర్పాటుపై ఆలోచన చేసినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో అందరూ అందరికీ కావాల్సిన వారేనని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తనను లోకల్.. నాన్ లోకల్ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని, కళాకారులందరూ లోకల్ కాదని యూనివర్సల్ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు తాను నాన్ లోకల్ ఎలా అవుతా? అని ప్రశ్నించారు. అకారణ శత్రుత్వం వద్దని చెప్పారు. అవార్డులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనే ప్రస్తావన ఎందుకు రాలేదు? అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. అలాగే, రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నన్ను నాన్ లోకల్ అని అనలేదని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ ప్రస్తావన? అని ప్రశ్నించారు. ఆవేదనతో పుట్టిన ‘సినిమా బిడ్డల ప్యానల్’ ఇదని తెలిపారు.
కేవలం తనకు పరిచయం ఉందన్న కారణంతో తాను ఓట్లు అడగడం లేదని.. ‘మా’ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తామని, అందరూ ఆశ్చర్యపడేలా పనిచేస్తామని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా భవనం ఎలా కడతామో ముందే చెబుతామని ప్రకటించారు. తాను పదవి కోసం రాలేదని, పనిచేయడానికి వచ్చానని అన్నారు. తాను చిన్న తప్పు చేసినా ప్రశ్నించే వారు తన ప్యానల్‌లో ఉన్నారని తెలిపారు. తనకు ప్రశ్నించే వారు, కష్టపడి పని చేసే వారు కావాలని చెప్పారు.*