* మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ ఒక నరరూప రాక్షసుడని మండిపడ్డారు. తెలంగాణకు వైయస్ చేసిన నష్టం అంతాఇంతా కాదని.. తండ్రి తప్పు చేసినా.. కొడుకు (వైయస్ జగన్) మంచి చేస్తాడని అనుకున్నామని…. కానీ, మామిడి చెట్టుకు మామిడి కాయలే కాస్తాయి, చింత చెట్టుకు చింతకాయలే కాస్తాయని విమర్శించారు. వైయస్ కడుపులో పుట్టినా అదే పద్ధతిలో జగన్ ఉంటాడని అనుకోలేదని… మనుషుల్లో మార్పు వస్తుందని అనుకున్నామని, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నామని చెప్పారు. కానీ జగన్ తీరు కూడా దారుణంగా ఉందని అన్నారు. రాజశేఖర్ రెడ్డిని దొంగ అనగానే వైసీపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణకు అడుగడుగున వైయస్ నష్టం చేశాడని అన్నారు. దోచుకుపోయినవాడిని దొంగ అనకపోతే ఇంకేమనాలని ప్రశ్నించారు. గతంలో వైయస్ దోచుకుపోయాడని, ఇప్పుడు ఆయన కొడుకు జగన్ దోచుకుపోతున్నాడని ఆరోపించారు. అందుకే దొంగ, గజదొంగ అని అంటున్నామని చెప్పారు. మమ్మల్ని దోచుకుంటే మాకు కడుపు మండదా? అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు కోసం దివంగత పీజేఆర్ కొట్లాడారని… ఆ తర్వాత ఏం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పీజేఆర్ చావుకు వైయస్సార్ కారణం కాదా? అని ప్రశ్నించారు. పీజేఆర్ ను వైయస్ ఎంతో క్షోభ పెట్టాడని మండిపడ్దారు. ఎందరో తెలంగాణ ప్రజలను నక్షలైట్ల పేరుతో చంపిన చరిత్ర వైయస్ దని దుయ్యబట్టారు. వైయస్సార్ అంటే కేవలం దొంగ మాత్రమే కాదని… ఒక నరరూప రాక్షసుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వెనుకబాటుతనానికి, ఎంతో మంది చావుకు వైయస్ కారణమని అన్నారు.
తమ మహబూబ్ నగర్ జిల్లా నుంచి 14 లక్షల మంది జనం వలస పోవడానికి వైయస్సార్ కారణం కాదా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లాకు శాశ్వత నష్టం చేసే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. నిన్నటి వరకు మంచితనం ప్రదర్శించిన జగన్ ఇప్పుడు ఊసరవెల్లిలా మారారని మండిపడ్డారు. నోట్లో చక్కెర పోసి కడుపుతో కత్తులు గుచ్చినట్టు ఏపీ పాలకుల తీరు ఉందని దుయ్యబట్టారు. జరుతున్న దోపిడీని కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.
* సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి తీరుతోనే పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ మద్దతుతోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతోందన్నారు. పాలమూరు జిల్లా వాసులను ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లతో తంతున్నాడని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో ఈటల గెలుపు తథ్యమన్నారు. తల్లకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్ హుజురాబాద్‌లో గెలవలేదన్నారు. శాసనసభలో బీజేపీకి ఈటల రూపంలో మరో ఎమ్మెల్యే పెరగబోతున్నారని డీకే అరుణ తెలిపారు.
* గతసంవత్సరం కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఆషాఢం బోనాల జాతరను ఈసారి ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రిమహమూద్అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బోనాల పండుగలకు విస్తృత ఏర్పాట్ల పై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సారి జాతరలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని, పోలీస్ లతో సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
* నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్‌లోని ఫతుల్లాగూడలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను నిర్మించారు. రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టణాల్లో కూడా నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చామన్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీ నంబర్ 18001201159. ఇప్పటికే జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను నిర్మించామని గుర్తు చేశారు. జీడిమెట్ల ప్లాంట్‌లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం జరుగుతుందన్నారు. ఇవాళ ప్రారంభించిన ఫతుల్లాగూడ ప్లాంట్‌లో కూడా రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో 2 వేల టన్నుల వ్యర్థాల పునర్వినియోగం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు.
* ఈ నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. మునిసిపల్ ఘనవ్యర్థాల నిర్వహణ విషయంలో అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాల విషయంలోనూ ముందు జాగ్రత్త చర్యలతో ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మాత్రం చెత్తను తీసుకెళ్లి ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ పడేసేవారని ఆయన తెలిపారు. చెత్తను ట్రాక్టర్లలో తీసుకెళ్లి ఏదైనా మైదానం కనపడితే అక్కడేదాన్ని వేసే వారని విమర్శించారు.
* గవర్నర్ తమిళసైను తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం కలిశారు. రాచకొండ పరిధిలో లాకప్‌డెత్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో రాజ్యాంగపరమైన స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. తెలంగాణలో పోలీసులకు, టీఆర్ఎస్ నేతలకు తేడా లేదని వ్యాఖ్యానించారు. పోలీసులు.. టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆచరణలో లేదని శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు.
* తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌కౌర్ అన్నారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు నవనీత్‌కౌర్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
* ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక రోజు ప్రథమ, మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం వారికి తరగతులు నిర్వహిస్తామని ఇంటర్ విద్యాశాఖ తెలిపింది. ప్రత్యక్ష, ఆన్‌లైన్ తరగతులు రెండూ అందుబాటులో ఉంటాయని, ఏ విధానంలో హాజరుకావాలన్నది విద్యార్థుల ఇష్టమేనని పేర్కొంది. ప్రత్యక్ష తరగతులకు రావద్దనుకుంటే ఇంటి నుంచి ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావొచ్చని, ప్రత్యక్ష తరగతులకు రావాలనుకుంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరని తెలిపింది. ఈ మేరకు కమిషనర్ జలీల్ మార్గదర్శకాలు జారీచేశారు. ఇంటర్ కళాశాలలను జులై 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో జులై 1న ప్రథమ సంవత్సరం తరగతులు, 2న ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభించనున్నారు.