NRI-NRT

విద్యార్థులకు అందుబాటులోకి అమెరికా వీసా స్లాట్లు

విద్యార్థులకు అందుబాటులోకి అమెరికా వీసా స్లాట్లు

అమెరికాలో పైచదువుల కోసం వెళ్లే విద్యార్థులకు వెసులుబాటు లభించింది. వర్సిటీల్లో చేరే గడువు పొడిగించటంతో పాటు జులై వీసా కోటా విడుదల కావటం ఇందుకు నేపథ్యమవుతోంది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు వచ్చే జులై, మరికొన్ని ఆగస్టు పదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జులై నెలలో హాజరు కావాల్సిన వారి గడువు మరో 25 రోజుల పాటు పొడిగిస్తూ అమెరికా వర్సిటీలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు శుక్రవారం ధ్రువీకరించారు. ఆగస్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన విద్యార్థులు తక్షణం ఆయా వర్సిటీల అధికారులతో సంప్రదించి తేదీల విషయాన్ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌, ప్రయాణ ఆంక్షలతో భారత్‌లో వీసా తదితర ప్రక్రియలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో దిల్లీలోని అమెరికన్‌ ఎంబసీతో పాటు ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాలలోని కాన్సులేట్‌ కార్యాలయాలు విద్యార్థి వీసా ఇంటర్వ్యూల ప్రక్రియను ఈ నెల 14 నుంచి ప్రారంభించాయి. విద్యార్థులు పెద్దసంఖ్యలో వాటి కోసం వేచి ఉన్నారు. స్లాట్స్‌ లభించక మరికొందరు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్‌ దశలవారీగా ఇంటర్వ్యూ ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా శుక్రవారం జులై కోటాను కూడా విడుదల చేయటంతో పలువురు విద్యార్థులు స్లాట్స్‌ పొందారు. అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపేవారిలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల విద్యార్థులే అధికంగా ఉంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు వీలుగా కాన్సులేట్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.