* ల్యాండ్ రోవర్ సంస్థ భారత్‌లోకి సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఎస్‌వీఆర్ కారును విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.19 కోట్లతో ప్రారంభమవుతుంది. ఈ కారు పూర్తిగా యూకేలో తయారై భారత్‌కు దిగుమతి అవుతుంది. ఈ కారు విడుదల సందర్భంగా జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి మాట్లాడుతూ ‘‘రేంజ్‌రోవర్ ఎస్‌వీఆర్‌లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చాం. దీంతో మంచి పనితీరు, విలాసవంతమైన సౌకర్యాలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. బ్రిటిష్ ఇంజిన్ శక్తి, విలాసాల కలయికతో తయారైన ఈ కారును వినియోగదారులు కచ్చితంగా అభిమానిస్తారు’’ అని పేర్కొన్నారు.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎమ్, బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా చేసే నగదు విత్‌డ్రాలపై సేవా రుసుములను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ కొత్త ఛార్జీలు.. చెక్‌బుక్, నగదు బదిలీ, ఇతర ఆర్థికేతర లావాదేవీలకు వర్తిస్తాయి. పునరుద్ధరించిన కొత్త సేవా రుసుములు జులై1, 2021 నుంచి అమలులోకి వస్తాయని, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడి) ఖాతాదారులకు కూడా ఈ రుసుములు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది.
* ఆన్‌లైన్ విద్యకు సంబంధించిన ‘అప్‌గ్రాడ్’ సంస్థ త్వరలో యూనికార్న్ సంస్థల జాబితాలోకి చేరనుంది. 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7500 కోట్లు) కంటే ఎక్కువ విలువ ఉండే కంపెనీని యూనికార్న్‌గా పిలుస్తారు. ఈ మేరకు త్వరలో 400 మిలియన్ డాలర్ల నిధులు సేకరించేందుకు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థలతో అప్‌గ్రాడ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మార్కెట్ విలువ ఐదింతలు పెరిగి 4 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2015లో ప్రారంభమైన అప్‌గ్రాడ్ ఈ ఏడాది ఇప్పటికే రెండు దఫాల్లో టెమాసెక్, ఐఎఫ్‌సీ నుంచి 160 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. దీంతో సంస్థ విలువ 850 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, తాజా నిధుల సమీకరణపై స్పందించడానికి సంస్థ ఛైర్మన్ రోనీ స్క్రూవాలా నిరాకరించారు. అలాగే ఈ రంగంలో ఉన్న కొన్ని చిన్న సంస్థల్ని ఈ ఏడాదే కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
* ఒకరోజు విరామం తర్వాత.. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 30పైసలు పెరిగింది. చమురు సంస్థలు ధరలను సవరించడంతో.. దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.81కి లభిస్తోంది. డీజిల్ రూ.89.13కి చేరింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, మణిపూర్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో లీటర్ పెట్రోల్ ఇప్పటికే వంద మార్కును దాటింది. ఇక రాజస్థాన్‌లో శ్రీగంగానగర్‌లో వంద మార్కు దాటిన పెట్రోల్‌ను ప్రస్తుతం రూ.110.04కి కొనుగోలు చేయాల్సి వస్తోంది. డీజిల్ ధర రూ.102.42గా ఉంది. ఆయా రాష్ట్రాల స్థానిక పన్నుల (వ్యాట్) ఆధారంగా ఈ ధరల్లో మార్పులుంటాయి.