బాగా జలుబు చేసినా తరచూ జలుబు చేస్తున్నా కొవిడ్ గురించి అంతగా భయపడక్కర్లేదు అంటున్నారు యేల్ యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే జలుబుకి కారణమైన రైనో వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైన యాంటీబాడీలు కొవిడ్‌కు కారణమైన సార్స్‌కోవ్-2 వైరస్‌నీ ప్రాథమిక దశలోనే గుర్తించి అడ్డుకుంటాయట. అదెలా అంటే- జలుబుకి కారణమైన రైనోవైరస్ లోపలకు వెళ్లగానే ఇంటర్‌ఫెరాన్స్ అనే జన్యు ప్రొటీన్లు దాన్ని పసిగట్టడంతో రోగనిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. ఆతరవాత కొవిడ్ వైరస్ లోపలకు వెళ్లినప్పుడూ ఇంటర్‌ఫెరాన్లు తక్షణం స్పందిస్తాయి. అదీగాక కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తొలి రెండు మూడు రోజుల్లోనే- అంటే, దాని లక్షణాలు బయటపడకముందే ప్రత్యుత్పత్తి చెందుతూ దాని సంఖ్యను పెంచుకుంటుంది. కానీ జలుబు వైరస్‌తో పోరాడేందుకు అప్పటికే అక్కడ ఉన్న రోగనిరోధక కణాలు సార్స్‌కోవ్‌నీ సమర్థంగా అడ్డుకోగలుగుతున్నట్లు గుర్తించారు పరిశీలకులు. అదే లోపల ఎలాంటి రైనోవైరస్ లేకుండా నేరుగా సార్స్‌కోవ్ సోకిన వాళ్లలో వైరస్ ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్లు కనుగొన్నారు. అందుకే ఈ ఇంటర్‌ఫెరాన్ జన్యు ప్రొటీన్లను మందు రూపంలో ఇవ్వడం ద్వారానూ కొవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించవచ్చు అంటున్నారు. పైగా లోపల ఉన్న రెండు రకాల వైరస్‌ల మధ్య ఏం జరుగుతుందనేది కచ్చితంగా తెలియదు కానీ ఒక వైరస్ ఉన్నప్పుడు మరొకటి ఎక్కువగా వృద్ధి చెందడం లేదన్నది మాత్రం స్పష్టమైందట.
జలుబు మంచిదే!
Related tags :