* రాష్ట్రంలో భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్‌గా నియమించారు. ఆయన విశాఖపట్నం లోక్‌సభ నుంచి.. 2014లో ఎంపీగా గెలుపొందారు. కంభంపాటి భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు.హరిబాబు ప్రకాశము జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ లో బిటెక్ చేశారు. తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు.రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా..మిజోరాం గవర్నర్ గా నియమించడం సంతోషంగా ఉందని విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని,పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఎంపీగా, ఏపీ బిజెపి అధ్యక్షుడిగా, అనేక రాష్ట్రాలకు ఇన్చార్జిగా పని చేసిన అనుభవంతో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు.మిజోరాం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే మంచి అవకాశాలు వస్తాయని అభిప్రాయ పడ్డారు.అభినందనలు..మిజోరాం గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. మిజోరం అభివృద్ధిలో హరిబాబు భాగస్వామి కావాలని వెంకయ్య నాయుడు ఆశించారు.
* టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా రేవంత్‌రెడ్డిని కలవడానికి భట్టి విక్రమార్క నిరాకరిస్తూ వస్తున్నారు. పీసీసీ రేసులో ఉన్నప్పటికీ పదవి దక్కకపోవడంతో భట్టి విక్రమార్క అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ను దిల్లీకి పిలిపించి మాట్లాడింది. దిల్లి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న భట్టి విక్రమార్కతో ఈరోజు ఉదయం సీనియర్ నేత మల్లు రవి చర్చలు జరిపారు. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు ఎంత ముఖ్యమో సీఎల్పీ నాయకుడు అంతే ముఖ్యమన్నారు. ఆ తర్వాత మల్లు రవితో కలిసి రేవంత్‌రెడ్డి… భట్టి విక్రమార్కను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. రేపు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
* కేసు విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు తాను సిద్ధమేనని ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి తెలిపారు. అయితే ఆ కేసులో తనను అరెస్టు చేయబోమని పోలీసులు హామీ ఇస్తేనే తాను స్టేషన్‌కు వెళ్తానని అన్నారు. ఈ మేరకు కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. గత నెల ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడికి సంబంధించిన వీడియోలు ట్విటర్‌లో వైరల్ అయ్యాయి. అయితే ఆ పోస్టుల్లోని తప్పుడు ప్రచారంతో ఘాజియాబాద్‌లో ఘర్షణలు తలెత్తడంతో ట్విటర్ ప్రతినిధులపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ ట్విటర్ ఎండీ మనీశ్‌కు రెండు సార్లు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
* ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ -మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు రాత్రి నుంచి జులై 8 రాత్రి వరకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
* కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోదీ సర్కారు సిద్ధమైంది. రేపు సాయంత్రం కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది. సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, నారాయణ్‌రాణేకి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. జేడీయూ ఎంపీ ఆర్.సి.పి.సింగ్, ఎల్‌జేపీ ఎంపీ పశుపతి కుమార్ తదితరులు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. అటు కేంద్రమంత్రిగా ఉన్న థావర్‌చంద్ గహ్లోత్‌ను నేడు కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో కొత్తగా 22 మందికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
* క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పాడు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లోనూ వారెన్నో సవాళ్లను ఎదుర్కొని నిరంతరం కష్టపడ్డారని కొనియాడాడు. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ఈనెల 23 నుంచి తిరిగి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 100 మందికి పైగా భారత అథ్లెట్లు ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించగా సచిన్ వారికి అండగా నిలుస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు.
* విశాఖ జిల్లాలోని అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లి శంకర్‌మఠ్ కూడలి వద్ద ఇంటర్‌ఛేంజ్ రహదారి నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాణంలో వంతెన సైడ్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో కారు, ఆయిల్ ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ లో ఉన్న వారికి గాయాలవడంతో వారిని అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్ధంతో కూలడంతో జనం పరుగులు తీశారు. కూలిన బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
* సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ ఇవాళ ప్రగతిభవన్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోనూసూద్ సాయం చేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
* కొవిడ్ మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో సెమిస్టర్ పరీక్షలు రాసే 17లక్షల మంది విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ప్రజల డిమాండ్‌తో రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందుకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు టీకా వేయించుకోవాల్సి ఉందని.. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా అందరి అభిప్రాయాలు తీసుకుని సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని కేరళ, కర్ణాటక, తెలంగాణలో విద్యార్థులు ఇప్పటికే నిరసనలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందుకే కొవిడ్ పాజిటివిటీ రేటు 5శాతానికంటే తక్కువగా నమోదు అయిందన్నారు. మూడో దశ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ప్రజల సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.