Devotional

రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం

రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం

ఆషాఢం అనగానే శూన్యమాసమనీ, శుభకార్యాలకు పనికిరాదనీ పెదవి విరుస్తుంటారు చాలామంది. ఆషాఢమనేది కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల పాలిట విలన్ లాంటిదని పళ్లు కొరుక్కుంటారు ఇంకొంతమంది. నిజానికి ఆషాఢమాసం తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించే మాసం. విజయవాడ కనకదుర్గమ్మను భక్తులు శాకంబరిదేవిగా అలంకరించి మురిసిపోతారు. జగానికే నాథుడైన పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర జరిగేది ఈ నెలలోనే. అని తల్లీతండ్రీ తర్వాత స్థానంలో ఉన్న గురువులను పూజించి, గౌరవించే గురుపౌర్ణమి వేడుకలు జరిగేది ఆషాఢంలోనే. ఆడపడచులందరూ గోరింటాకుతో ఎర్రగా మిరప్పళ్లలా పండిన చేతులతో కనిపించేది, ఈ కాలంలో విరివిగా వచ్చే వాక్కాయలతో పప్పు, మునగకాడలతో ఘుమఘుమలాడే చారో పులుసో కాచుకునేది, పొట్లకాయ కూర, పెరుగుపచ్చడి చేసుకునేది ఆషాఢంలోనే!
*కొత్తగా పెళ్లయ్యి, పుట్టింటి మీద బెంగను అత్తమామలకి చెప్పుకోలేక తనలో తనే సతమతమవుతూన్న కొత్తకోడలి పాలిట ఆపద్భాంధవి ఆషాఢం కాదా! అత్తగారు, మామగారు, ఆడపడచులు, మరుదులను అర్థం చేసుకుంటూ, వాళ్లకి కావలసినవి వేళకు ఎలా అమర్చగలమా అని ఆందోళన పడే వేళ నేనున్నానంటూ వచ్చి, కళ్లు తుడిచేది ఆషాఢ మాసంలోనే.
*మొన్న మొన్ననే పెళ్లయ్యింది.. భార్యతో ఇంకా అచ్చటాముచ్చటా తీరనేలేదు… ఇంతలోనే నా పాలిటి విలన్‌లా దాపురించింది ఆషాఢం అని తిట్టుకునే రోజులా ఇవి! ఎప్పుడో పోయాయి. ఆషాఢంలో అత్తాకోడలూ, అత్తా అల్లుడూ నే కదా, ఒక గడప దాటకూడనిది, మొగుడూ పెళ్లాల విషయంలో ఆ రూలేమీ లేదు కదా అని ఎట్లాగో అట్లా నానా తంటాలు పడుతూ వెళ్లి, భార్యను ఆమె బాబాయి ఇంటికో, పిన్నిగారింటికో రప్పించుకుంటే సరి, అక్కడ కూడా మర్యాదలన్నీ అందుకోవచ్చుకదా! అని ఆలోచించని వాళ్లు, దానిని వెంటనే అమలు చెయ్యని వాళ్లు చాలా అరుదు.
*అసలు ఆషాఢంలో కలుసుకోకూడనిదే భార్యాభర్తలు. ఎందుకంటే ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల గర్భోత్పత్తి జరిగి, ఎండాకాలంలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అప్పుడే భూమిమీదికొచ్చిన చిన్నారులు ఆ ఎండలను తట్టుకోలేక నానా ఇబ్బందులూ పడతారు. వాళ్ల బాధలు చూడలేక మళ్లీ మనం బాధపడాలి. అదొక్కటేనా? వ్యవసాయ పనులు ఆరంభమయ్యేది తొలకరి జల్లులు కురిసే ఆషాఢంలోనే. అంతకాలం ఎండవేడిమికి భూమిలోపలి పొరల్లో దాగి ఉన్న క్రిమికీటకాలు వర్షాలకు బయటికొచ్చి, వీరవిహారం చేస్తాయి. ఈగలూ దోమలూ ముసిరి, రకరకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు. కొత్తగా పెళ్లయినవాళ్లేమో, భార్య ఇంటిదగ్గర ఉండి, ఆమె మీదకు ధ్యాస మళ్లుతూ ఉంటుంది. దానిమూలంగా వ్యవసాయ పనులు దెబ్బతింటాయి. రైతులకు ఇంత అన్నం పెట్టేది, ఆధారభూతమయ్యేదీ వ్యవసాయపనులే కదా అందువల్లే పెద్దవాళ్లు నవ వధూవరుల మధ్యలో ఆషాఢాన్ని అడ్డం పెట్టారు. ఆషాఢంలో అత్తాకోడలూ ఒక ఇంటి గడప దాటకూడదనడం వెనక ఇన్ని విషయాలున్నాయన్నమాట.
*ఇక ఆషాఢం వచ్చింది మొదలు గోరింటాకు పెట్టుకోకూడదటే ఆ చేతులకూ అని బామ్మలు, అమ్మమ్మలు సణుగుడు మొదలెడతారు. వాళ్ల సణుగుడు తట్టుకోలేక కన్నెపిల్లలు ఎవరి ఇంట్లోనో ఉన్న గోరింట చెట్టునుంచి ఇంత ఆకు కోసుకొచ్చి, అందులో చింతపండు ముద్ద వేసి, మధ్యమధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ నూరడం మొదలెడతారు. మెదిగిందా లేదా అని రోట్లోకి ఆకును తోసేటప్పుడే చిలకముక్కుల్లా ఎర్రగా పండిన అమ్మ చేతులని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. కొత్తగా పెళ్లయి, పుట్టింటికి వచ్చిన నవ వధువులు కూడా ఆషాఢంలో చేతులనిండా గోరింటాకు పెట్టుకుని, తిరిగి అత్తారింటికి వెళ్లాక అమ్మ లేదా చెల్లి పెట్టిన గోరింటాకు చేతులను చూసుకుంటూ వారి జ్ఞాపకాల్లో మునిగిపోతారు. ఎర్రగా పండిన చేతులను భర్తకు చూపించి మురిసిపోతారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనక శాస్త్రీయ కారణాలేమిటంటే, గోరింట వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్టు వంటివి రాకుండా ఉంటాయి. గోరింటాకు మందారంలా పండితే మంచిమొగుడొస్తాడని, సింధూరంలా పూస్తే కలవాడొస్తాడని పెద్దలు చెబుతారు. అదే వివాహితలకు అయితే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు చెబుతారు. ఇవన్నీ ఒకప్పటి తీపి జ్ఞాపకాలు.
ఇప్పుడయితే ఆషాఢం వచ్చిందంటే బంపర్ సేల్సు, డిస్కౌంట్ సేల్సు, ఆఫర్ల మీద ఆఫర్లు, కేజీల్లెక్కన చీరలమ్ముతారు… క్రెడిట్ కార్డుకు చిల్లులు పొడుస్తారు. సెల్‌ఫోన్లు కూడా ఒకటి కొంటే మూడు ఉచితం అని ఊరించడం, కొన్న తర్వాత ఫ్రీ పీసులకు మా పూచీ లేదని ముందే చెప్పాం కదండీ అని గిల్లుతూనే కావాలంటే, మరో పీసొచ్చింది చూడండి, ఎక్స్ఛేంజ్ చేసుకుని చూడండి అని ఊరడింపులు… ఇవి చూస్తుంటే ఆషాఢమంటేనే ఒకలాంటి బెంగ. డిస్కౌంట్ అంటేనే దిగులు..!