DailyDose

అమెజాన్‌లో కొన్న కత్తి తీసుకుని ప్రేయసి ఇంటికి వెళ్లి…-నేరవార్తలు

అమెజాన్‌లో కొన్న కత్తి తీసుకుని ప్రేయసి ఇంటికి వెళ్లి…-నేరవార్తలు

* బంగ్లాదేశ్‌కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏండ్ల మహిళను ఒక ముఠా ఆ దేశం నుంచి భారత్‌కు అక్రమంగా తరలించింది. ఆమెను పలు రాష్ట్రాలకు తిప్పిన ఆ ముఠా చివరకు కర్ణాటకలోని బెంగళూరుకు తీసుకొచ్చింది. అక్కడ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించింది. అయితే వారి మధ్య ఆర్థిక విభేదాలు రావడంతో ఆ మహిళను క్రూరంగా హింసించడంతోపాటు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్‌ భాగాల్లో బాటిల్‌ను చొప్పించి పైశాచిక ఆనందం పొందారు. మే నెలలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

* ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ముందు లొంగిపోయారు. సిపిఐ (మావోయిస్టు) పార్టీ జెగురుగొండ ఏరియా కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు (ఎసిఎం), హేముల రామా అలియాస్ లక్ష్మణ్, జెగురుగొండ 10వ ప్లాటూన్ సభ్యురాలు మడకం పైకి అలియాస్ లక్ష్మి పోలీసులకు లొంగిపోయారని ఎస్పీ మీడియాకు తెలిపారు.

* వాకింగ్ కోసం వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి గోడ కూలి మీద పడటంతో మృతి చెందిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్ నగర్‌కు చెందిన ఆశిష్ బుధవారం సాయంత్రం వాకింగ్ చేసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. చీకటి పడుతున్నప్పటికీ ఆశిష్‌ తిరిగి ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో వెంటనే వెళ్లి ఎస్‌ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రాజీవ్ నగర్ ప్రాంతంలో గోడ కూలడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా ఆశిష్‌ మృతదేహం బయటపడింది. వాకింగ్ చేస్తూ గోడ పక్కగా వెళుతుండగా అతనిపై పడటంతో మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* దాదాపు నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు.. తరువాత గొడవపడ్డారు. ఈ క్రమంలో.. మాట్లాడుతానంటూ రాత్రి వేళ యువతి వద్దకు కత్తితో వచ్చాడు.. ఆమె అప్రమత్తమై 100 నంబరుకు ఫోన్‌ చేసింది. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. బోరబండ సమీపంలోని బంజారానగర్‌లో నివసించే బండారి శ్రీకాంత్‌(25) నాలుగేళ్ల కిందట ఎన్‌ఎస్‌బీ నగర్‌లో ఉండేవాడు. ఓ స్టార్‌ హోటల్‌ జిమ్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యువతి(23)తో పరిచయం ఏర్పడింది. తరువాత వీరి మధ్య గొడవలు జరగడంతో 2020 అక్టోబరులో యువతి ఫిర్యాదుతో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై కేసు నమోదైంది. కొద్ది రోజులుగా ఆమెను కలవాలంటూ అతను కోరుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్‌ చేసిన శ్రీకాంత్‌ ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో యువతి, ఆమె సోదరి ఉన్నారు. కూర్చొని మాట్లాడుతుండగా అతని వెనుక భాగంలో కత్తి ఉన్నట్లు యువతి సోదరి గుర్తించింది. తన సోదరిని పిలిచి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకోవాలని సూచించింది. దీంతో యువతి గదిలోకి వెళ్లి రాత్రి 12.53 గంటలకు 100కు సమాచారం అందించింది. ఈలోపు యువతి సోదరి అతన్ని మాటల్లో పెట్టింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ కార్‌2 సిబ్బంది సందీప్‌ తదితరులు వెంటనే యువతి ఇంటికి చేరుకున్నారు. యువకుడిని తనిఖీ చేయగా జాంబియా(కత్తి) లభించింది. శ్రీకాంత్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సోదరుడి జన్మదిన వేడుకల కోసం కత్తిని తీసుకెళ్లినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. యువతిపై దాడి చేసేందుకు వెళ్లాడా.. అనే కోణంలో వారు విచారిస్తున్నారు. ఈ కత్తిని అమెజాన్‌లో రూ. 1500కు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.